ద్వారంపూడి ని కాపాడుతున్నది ఎవరు?
ఈ మొత్తం వ్యవహారంలో అనుమానాలు ఎన్నో!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి పై జన సేన అధినేత ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు . ద్వారంపూడి కూడా అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కాసేపు పక్కనపెడితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కోటా కింద పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖ కేటాయించారు. జనసేన నుంచి సివిల్ సప్లయిస్ శాఖ దక్కించుకున్న నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే దూకుడుగా వ్యవహరించారు. ఆయన తన ఫోకస్ అంతా కాకినాడ మీదే పెట్టారు. అంతే కాదు...అధికారికంగా ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి తో పాటు ఆయన ఫామిలీ బియ్యం ఎక్స్ పోర్ట్ స్కాం లో ఉంది అని ..ఈ కేసు లు సిఐడి కి అప్పగిస్తామని ప్రకటించారు. వేల కోట్ల కుంభకోణం వెనక ద్వారంపూడి ఉన్నారు అని ఎంతో స్పష్టంగా ప్రకటించారు. మరో వైపు దారిమళ్లుతున్న పీడిఎస్ బియ్యాన్ని కూడా తనిఖీల్లో భాగంగా సీజ్ చేశారు కూడా . బియ్యం మాఫియా లో ఒక్క ద్వారంపూడి కి చెందినవే కాకుండా పలు ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి.
విచిత్రంగా గత కొన్ని రోజులుగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ..సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కానీ ఈ ఊసు ఎత్తడం లేదు. ద్వారంపూడి అండ్ కో మాఫియా పై సిఐడి విచారణ జరిపిస్తాం అని ప్రకటించారు కానీ..అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో తెరవెనక ఏదో జరిగింది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ అవసరాల కోసం అని ఎవరి పై అయితే ఆరోపణలు చేశారో...ఆ సో కాల్డ్ మాఫియా నుంచే వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే చర్చ సాగుతోంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్..అయినా నాదెండ్ల మనోహర్ అయినా ఈ విషయంలో గతంలో చూపించిన దూకుడు చూపించకుండా..మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు అని చెపుతున్నారు. ఎవరికైనా సరే తొలి రోజుల్లో నాదెండ్ల మనోహర్ చూపించిన దూకుడికి...ఇప్పుడు అసలు గతంలో ఏమి జరిగిందో తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుంది అనే చర్చ సాగుతోంది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి గతంలో దోపిడీ చేశారు అని ఆరోపించిన వాళ్ళే ఇప్పుడు ఏమి కిక్కురుమనటం లేదు. దీంతో తెర వెనక ఏదో భారీ మతలబు జరిగి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు..కోట్లు చేతులు మారినా కూడా వాటికి ఎలాంటి ఆధారాలు ..జీవో లు అంటూ ఏమి ఉండవు అనే విషయం తెలిసిందే. ఫస్ట్ ఏదో జరిగిపోయింది ..వేల కోట్ల రూపాయలు స్కాం అని గగ్గోలు పెట్టి...ఆ తర్వాత మౌనాన్ని ఆశ్రయించటంతోనే ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లు కనిపిస్తోంది అని చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల లబ్ది పొందిన పవర్ కంపెనీలతో లాలూచి పడితే...మిత్రపక్షం బియ్యం మాఫియా తో డీల్ కుదుర్చుకున్నట్లు ఉంది అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో కూడా కాకినాడ కేంద్రంగా సాగిన బియ్యం మాఫియా పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఇది వంద శాతం నిజం అని నిర్ధారణ అయినట్లే. గత ప్రభుత్వ మాఫియా ను కట్టడి చేయాల్సిన కొంత మంది కీలక మంత్రులే ఇప్పుడు బియ్యం ఎగుమతిదారులు...మిల్లర్లకు అండగా నిలవటానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.