పవర్ అక్రమాలపై అప్పట్లో తీవ్ర విమర్శలు
కోర్టు ల్లో కేసులు ..ఇప్పుడు అందుకు భిన్నంగా నిర్ణయాలు
ఐఏఎస్ అధికారి అంటే ఐఏఎస్ అధికారి అంతే. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఎన్నో విచిత్రాలు ఉంటాయి. అక్కడ కొంత మంది కి జగన్ ఐఏఎస్ లు... మరి కొంత మంది కి చంద్రబాబు ఐఏఎస్ లు అంటూ ‘ముద్రలు’ పడతాయి. దీనికి ప్రధాన కారణం కొంత మంది ఐఏఎస్ అధికారులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంతగా అంటకాగుతారు అనే ఆరోపణలు ఎదుర్కొంటారు . కొంత మంది ఐఏఎస్ లు అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెపితే అది చేస్తూ పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారు అనే ప్రచారం కూడా ఐఏఎస్ సర్కిల్స్ లో కూడా ఉంది. విచిత్రం ఏమిటి అంటే గత వైసీపీ హయాంలో ప్రస్తుతం లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి జైలు కి వెళ్లిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఎక్కడలేని హవా చెలాయించారు అనే ప్రచారం ఉంది. కొంత మంది వైసీపీ నేతలు..ఎమ్మెల్యేలు కూడా అధికారికంగా ఈ విషయం చెప్పారు కూడా.
ఎంత పెద్ద నాయకుడు అయినా కూడా జగన్ ని కలిస్తే వచ్చేది ఒక్కటే సమాధానం ..అది ఏంటి అంటే వెళ్లి ధనుంజయ్ రెడ్డి ని కలవండి అని. ఈ విషయం వైసీపీ లో బహిరంగ రహస్యమే. ఇది అంతా జగన్ జమానా కథ. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎం అయినప్పుడు ధనుంజయ్ రెడ్డి స్థాయిలో కాకపోయినా సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి రాజకీయ వ్యవహారాల్లో ..కాంట్రాక్టు ల సర్దుబాటులో జోక్యం చేసుకున్నారు అనే విమర్శలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర కూడా కొంత మేర ఎదుర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన నేతలే అధికారికంగా అప్పటిలో ఆయన పేరు చెప్పిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం లో ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ అయి..జైలు కు వెళ్లిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ ఒకటి తెరమీదకు వచ్చింది. జగన్ ఏది చెపితే అది చేసిన వాళ్ళు అంతా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటి అంటే అందరి విషయంలో అలా జరగటం లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట.
ఉదాహరణకు ఎక్కువ మంది ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విషయాన్ని ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరసగా శ్వేత పత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అత్యంత కీలకం అయింది విద్యుత్ శ్వేత పత్రం. జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగం నాశనం అయింది అని...జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వాళ్ళ ఏకంగా లక్ష కోట్ల రూపాయల పైన నష్టాలు వచ్చాయి అని ఆరోపించారు. ఇది ఒకటి అయితే ఇక్కడ మరో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సెకి ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడబోతోంది అని విమర్శించింది. దీనిపై టీడీపీ నేతలు కోర్టు కు కూడా వెళ్లారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే టీడీపీ ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారానికి సెకి ఒప్పందం కారణం అయింది అని విమర్శలు చేస్తే...ప్రస్తుతం సిఎస్ గా ఉన్న విజయానంద్ గతం లో అంటే జగన్ హయాంలో సెకి ఒప్పందం ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ అభివర్ణించారు. దేశంలోని తొలిసారి గా సెకి తో ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు ఆయన అప్పట్లో ప్రకటించారు. 30 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించాలనేది జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అని చెప్పుకొచ్చారు.
సెకి ఒప్పందం విషయం ఇలా ఉంటే జగన్ ఐదేళ్ల పాలనలో అతి తక్కువ సమయంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ కి దగ్గర దగ్గర విద్యుత్ శాఖలో లక్ష కోట్ల రూపాయల పైన ప్రాజెక్ట్ లు కట్టబెట్టారు అంటూ టీడీపీ నేతలే విమర్శలు చేశారు...దీనిపై కూడా కోర్టు కు వెళ్లారు. స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ తో పాటు ట్రాన్స్ ఫార్మర్స్ కొనుగోళ్లలోనూ ఎక్కువ రేట్లు ఇచ్చి ఆ కంపెనీ కి వందల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ది కలిపించినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. అన్నిటి కంటే కీలక విషయం ఏమిటి అంటే జగన్ హయాంలో టీడీపీ నేతలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ సమయంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నది ప్రస్తుత సిఎస్ విజయానందే. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు విద్యుత్ ప్రాజెక్ట్ ల పీపీఏ లు రద్దు చేయటం...ఆ విషయం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీని సెటిల్ మెంట్ లో కూడా అప్పటిలో విద్యుత్ శాఖలో ఉన్న కీలక అధికారి చక్రం తిప్పినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతాయి. టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేసిన సమయంలో అంటే జగన్ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయానంద్ కు టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా సారధ్య బాధ్యతలు అంటే ఏకంగా చీఫ్ సెక్రటరీ పోస్ట్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన్నే కొనసాగిస్తోంది.
గతంలో ఎప్పుడూ సిఎస్ గా పనిచేసిన వాళ్లకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ కేటాయించే వాళ్ళు కాదు. కానీ ఇప్పడు మారిన పరిస్థితుల్లో అన్నిట్లో కూడా అధికారంలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెపుతున్న లిక్కర్ స్కాం 3500 కోట్ల రూపాయల తో పోలిస్తే విద్యుత్ శాఖలో ఎన్నో రేట్ల ఎక్కువ స్థాయిలో స్కాం లు జరిగాయని టీడీపీ నేతలే చెపుతున్నారు. ఆ సమయంలో కీలక బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ ను సిఎస్ తో పాటు విద్యుత్ శాఖ బాధ్యతలు కూడా అప్పగించినందున ఆయనఇప్పుడు ఎవరి ఐఏఎస్ అని ఒక సీనియర్ మంత్రి సందేహం వ్యక్తం చేశారు. స్కాం లో విషయంలో కూడా ఒక సెలెక్ట్ మోడల్ లో వెళుతున్నారు అన్నది ఐఏఎస్ అధికారుల అభిప్రాయం గా కూడా ఉంది.