జగన్ హయాంలో కుదిరిన సెకి ఒప్పందం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని ప్రతిపక్షంలో ఉండగా తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సెకి ఈ విద్యుత్ అంతా కూడా అదానీ కంపెనీల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది. ఎక్కువ ధరకు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం వల్ల ప్రజలపై భారం పడుతుంది అని ఎన్నికల ముందు వరకు చెప్పింది. ఏకంగా కోర్టు లో కూడా కొంత మంది టీడీపీ నేతలు కేసులు వేశారు . అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందం రద్దు చేసుకుంటే ప్రభుత్వం మూడు నుంచి మూడున్నర వేల కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది అని చెప్పి..ప్రజలపై వచ్చే 20 నుంచి 25 సంవత్సరాల్లో 97000 కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు అని చెప్పి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తోంది.
అంతిమంగా దీని ద్వారా ఎక్కువ లబ్దిపొందేది అదానీ కంపెనీలే అని చెప్పొచ్చు. సెకి ఒప్పందంతో అదానీ కంపెనీలకు జరిగే ప్రయోజనం చాలదన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ విదేశీ బొగ్గును కూడా ఈ సంస్థ నుంచే కొనుగోలు చేస్తోంది. పైకి అంతా టెండర్ ప్రకారమే ఈ డీల్ కుదిరినట్లు ఉన్నా కూడా తెర వెనక ఎన్నో విషయాలు ఉన్నాయి అని విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇవే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో అదానీ గ్రూప్ కు అటు ఓడరేవులతో పాటు ఎన్నో పెట్టుబడులు ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ లో వివిధ సంస్థల ఏర్పాట్లు చేయనున్న డేటా సెంటర్ల భూమి మొత్తాన్ని అంటే 480 ఎకరాలను అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో బుధవారం రాత్రి అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన తనయుడు కరణ్ అదానీ తో పాటు ఇతర అధికారులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు...ఇతర ప్రాజెక్ట్ ల అంశంపై చర్చినట్లు చెపుతున్నారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబబు నాయుడి ముందు గౌతమ్ అదానీ, కరణ్ అదానీ లు కూర్చున్న తీరు టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశగా మారింది. ఈ ఫోటో లు చూస్తుంటే ఇచ్చేది అదానీ...తీసుకునేది చంద్రబాబు అన్నట్లు ఉంది తప్ప...ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పారిశ్రామికవేత్తలు సమావేశం అయినట్లు లేదు అని ఒక టీడీపీ మంత్రి వ్యాఖ్యానించారు. ఎంత ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు అని పేరున్నా మాత్రం ఒక ముఖ్యమంత్రి ఇంతగా ఉండాల్సిన అవసరం లేదు అని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని విషయాలు ఫోటో లే చెపుతాయి. కొంత మంది విషయంలో మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా ఉంటారో అర్ధం కాదు అని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది నెలల క్రితం లులు అధినేత యూసుఫ్ అలీ ఎవరూ చేయని విధంగా చంద్రబాబు భుజం మీద చేయి వేసి మాట్లాడిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ అదానీ, కరణ్ అదానీల ముందు వీళ్ళు అణుకువగా కూర్చున్నట్లు ఉంది అని..ఇది ప్రజలకు ఏ మాత్రం మంచి సంకేతం పంపదు అని మరో నేత వ్యాఖ్యానించారు.