ఈ బంధం చాలా ‘పవర్ ఫుల్ ’!

Update: 2025-11-07 11:31 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ..ఆయన ఐదేళ్ల పాలన పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు తీవ్ర స్థాయిలో మండిపడతారు. కానీ జగన్ హయాంలో ఒక వెలుగు వెలిగిన...ముఖ్యంగా విద్యుత్ శాఖలో జగన్ అస్మదీయ కంపెనీలకు పెద్ద ఎత్తున మేళ్లు చేసి పెట్టారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయానంద్ ను తెలుగు దేశం సారథ్యంలో కూటమి ప్రభుత్వం నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నియమించటంతో అవాక్కు అవటం ఆ పార్టీ నాయకుల వంతు అయింది. టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా అదానీ-సెకి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే..ఇదే విజయానంద్ జగన్ జమానాలో ఈ ఒప్పందం ఎంతో ముందు చూపుతో...రైతుల మేలు కోసం చేసుకున్నది అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని ఆరోపించిన టీడీపీ ....మూడు వేల కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వస్తుంది..ప్రజలపై 97 వేల కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు అని చెప్పి సర్దుకు పోయింది.

                                             గతంలో ఎన్నడూ లేని రీతిలో సిఎస్ గా ఉన్న విజయానంద్ కే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించింది. అంతే కాదు ఆయన ఏపీ జెన్ కో , ట్రాన్స్ కో చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. సిఎస్ గా విజయానంద్ పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఆయనకు సిఎస్ గా పొడిగింపు దక్కుతుందా...లేక రేస్ లో ఉన్న సాయి ప్రసాద్ కు సిఎస్ పదవి దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయి ప్రసాద్ ఈ పోస్ట్ కోసం భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం విజయానంద్ కు తొలుత ఆరు నెలల పాటు పొడిగింపు దక్కే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఒక వేళ ఏ కారణంతో అయినా ఇది సాధ్యం కాకపోతే మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ పోస్ట్ విజయానంద్ కు కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. విజయానంద్ కు సిఎస్ పొడిగింపు ఇస్తే మాత్రం అప్పుడు ఈఆర్ సి చైర్మన్ పోస్ట్ సాయి ప్రసాద్ కు ఇస్తారు అని చెపుతున్నారు.

                                          సాయి ప్రసాద్ మాత్రం గతంలో హామీ ఇచ్చిన విధంగా తనకు సి ఎస్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే విజయానంద్ మాత్రం తనకు ఎక్స్ టెన్షన్ విషయంలో ధీమాగా ఉన్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఆసక్తికరం విషయం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం విజయానంద్ అత్యంత కీలకం అయిన పవర్ సెక్టార్ చుట్టూనే ఉంటారు అని...పదవి విరమణ తర్వాత కూడా ఆయన సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు అధికారుల్లో ప్రచారం సాగుతోంది. ఎప్పటి నుంచో ఏపీ ఈఆర్సి చైర్మన్ పోస్ట్ భర్తీ చేయకుండా ఇంచార్జి తోనే నడిపిస్తున్నారు. ఇప్పుడు విజయానంద్ పొడిగింపు విషయంలో స్పష్టత వస్తే ఈ పోస్ట్ ఎవరికీ దక్కుతుంది అనే విషయం కూడా తేలిపోతుంది అన్నది అధికార వర్గాలు చెపుతున్న మాట. గతంలో విజయానంద్ తమకు అందించిన సేవలకు గుర్తింపుగానే ఈ పోస్ట్ ఇచ్చినట్లు ప్రభుత్వం పెద్దలు పార్టీ నాయకుల వద్ద బహిరంగంగా చెపుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News