బాబు స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకోవటంలో వ్యవహారం నాన్చుతారు. అంత త్వరగా ఏ విషయం తేల్చరు. నిర్ణయాలు తీసుకోవటంలో చంద్రబాబు స్టైల్ ఆ పార్టీ నాయకులకే కాదు..అధికారులకు కూడా తెలుసు. ఎక్కడవరకో ఎందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వైజాగ్ లో నిర్మించి రుషికొండ భవనాలపై కూడా కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత కూడా ఇంతవరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడే ఇందులో కాస్త కదలిక వచ్చింది. ఇంత కాలంగా ఆ బిల్డింగ్ లను ఖాళీగా పెట్టి కోట్ల రూపాయల పవర్ బిల్స్ తో పాటు నిర్వహణ ఖర్చులు భరించాల్సి వచ్చింది. చంద్రబాబు నిర్ణయాలు చాలావరకు ఇలాగే ఉంటాయి. కానీ ఒక విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చూసి తెలుగు దేశం నాయకులే కాకుండా...మంత్రులు..అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. చంద్రబాబు చరిత్రలో ఒక అంశంపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నది బహుశా ఈ ఒక్క విషయంలోనే అయి ఉండొచ్చు అనే అభిప్రాయం మంత్రుల్లో కూడా వ్యక్తం అవుతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో ఎంత ఇంటరెస్ట్ ఉంటే ఇంత వేగంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారో అనే చర్చ కూడా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలిదశలో నాలుగు కాలేజీలు అంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కాలేజీల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా...ఒక్క ఆదోని కాలేజీ కి మాత్రమే తొలుత బిడ్స్ దాఖలు చేసింది అని వార్తలు వచ్చాయి..ఇప్పుడు అది కూడా తూచ్ అంది. దీంతో మొత్తం నాలుగు కాలేజీలకు ఎలాంటి బిడ్స్ దాఖలు కానట్లే లెక్క. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు బిగ్ షాక్ గా మారింది. మాములుగా అయితే ఇలాంటి విషయాల్లో చంద్రబాబు పలు సమావేశాలు పెట్టి ఎలా ముందుకు వెళ్లాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే వారు. కానీ ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించే విషయంలో చరిత్రలో ఎన్నడూ లేని అంత వేగంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.
పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కాలేజీలకు అప్పగించటమే పెద్ద స్కాం అనే విమర్శలు వస్తుంటే...అది చాలదు అన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ఈ కాలేజీలను తీసుకోవటానికి ముందుకు వచ్చే సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కూడా ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమకూరుస్తామని చెపుతున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించటం స్కాం అనే విషయాన్ని ఒక్క వైసీపీ నే కాదు...రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తో పాటు ఎంతో మంది చెపుతున్నారు. న్యాయబద్దంగా నడిపితే కూడా ఒక్కో మెడికల్ కాలేజీ పై ఏడాదికి 180 నుంచి 250 కోట్ల రూపాయల లాభం వస్తుంది అని పీవీ రమేష్ ఒక మీటింగ్ లో వెల్లడించారు. ఏదో ఒక రహస్య ఎజెండా లేకపోతే చంద్రబాబు ఈ కాలేజీల విషయంలో ఇంత వేగంగా స్పందించే వారు కాదు అని...అదే సమయంలో ఇంకా వీజీఎఫ్ వంటి ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు అంటే ఇందులో ఏదో భారీ మతలబు ఉండి ఉంటుంది అని అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.