చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారబోతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి రోజా ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెకు ఫోటీగా ఒకప్పటి హీరోయిన్, నటి వాణి విశ్వనాధ్ రంగంలోకి దిగనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను నగరి నుంచి పోటీచేస్తానని..అయితే పార్టీ ఏది అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆమె బుధవారం నాడు నగరిలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న తన అభిమానుల కోరిక మేరకు ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా అయినా సరే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నగరిలో తమ అమ్మమ్మ నర్సుగా పని చేసిందని తెలిపారు.
నగరికి చెందిన రామానుజం చలపతితో కలసి వచ్చిన ఆమెకు ఒకటవ వార్డు సామాలమ్మగుడి వద్ద మంగళ హారతులతో స్వాగతం పలికారు. రామానుజం చలపతికి జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక నగరి నుంచే ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధపడ్డానని వాణీవిశ్వనాథ్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. అంతే కాదు..తనకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులను కొంత మంది ప్రోత్సహిస్తున్నారంటూ రోజా పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే అధిష్టానం ఎక్కడా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో నగరి నుంచి పోటీకి ముందుకు రావటంతో ఇక్కడి రాజకీయం మరింత రసకందాయంలో పడనుంది.