స్కెచ్ వేసిన సీనియర్ ఐఏఎస్!

Update: 2024-09-14 05:36 GMT

స్కాం లు రెండు రకాలు. కొత్తగా ఎవరికీ దొరక్కకుండా స్కాం చేయటం ఒకటి. గత ప్రభుత్వంలో జరిగిన స్కాం లను ఆసరా చేసుకుని..తమ వాటా తాము తీసుకోవటం మరొకటి. దీనివల్ల రెండు లాభాలు...వాళ్లకు కొత్తగా స్కాం చేసినట్లు పేరు రాదు...పైగా చేతికి వేల కోట్ల రూపాయలు వచ్చిపడతాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. ప్రతిపక్షంలో ఉండగా కొన్ని కంపెనీలపై తీవ్ర విమర్శలు చేస్తారు. తాము అధికారంలోకి వస్తే వాటి సంగతి చూస్తాం..అక్రమ సొమ్మును కక్కిస్తాం అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోతారు. అది కూడా ఊరికే కాదు. ఆ సైలెన్స్ ఖరీదు వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మూడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువుతీరిన కూటమి సర్కారు కూడా ఇదే దిశగా పయనిస్తున్నట్లు అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పైన చెప్పుకున్న తరహాలోనే గత ప్రభుత్వంలో జరిగిన పెద్ద పెద్ద డీల్స్ పై ఇప్పటి ప్రభుత్వం కనీసం నోరు కూడా తెరవటం లేదు. పైగా ఈ ప్రోజెక్టుల అంశంపై కూటమి సర్కారు అనుకూల మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి.

                                                                         అయినా కూడా టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి ఎందుకు సైలెంట్ గా ఉంది అన్నదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూటమి సర్కారులోని ఒక కీలక మంత్రి జగన్ సర్కారు లో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందిన కొన్ని కంపెనీల నుంచి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి ‘డీల్ ’ పూర్తి చేసుకున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. లావాదేవీలు కూడా కొంత మేర పూర్తి అయినట్లు టాక్. అందుకే ఈ విషయంపై అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ డీల్ కుదర్చటంలో ఒక కీలక అధికారి ప్రధాన భూమిక పోషించి ఆయా సంస్థలు గత ప్రభుత్వంలో పొందిన ప్రయోజనాలకు గాను రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేలా చేసినట్లు చెపుతున్నారు. ఇది అంతా సాగింది విద్యుత్ శాఖకు చెందిన విషయాల్లో అయినా..ఇందులో ఆ శాఖ మంత్రికి మాత్రం ఎలాంటి ప్రమేయం లేదు అని ఆ వర్గాలు చెపుతున్నాయి. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు..ఒక కీలక మంత్రి మొత్తం వ్యవహారం నడిపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరి ఈ డీల్ విషయం ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుసో లేదో అన్న చర్చ కూడా సాగుతోంది.

                                                                                                                                       ఈ స్కెచ్ వేయటానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ లు అన్ని జగన్ సర్కారు హయాంలో అయన అస్మదీయులకు కట్టబెట్టినట్లు టీడీపీ ప్రచారం చేసినవే. కానీ ఇప్పుడు మాత్రం పెట్టుబడుల వాతావరణం దెబ్బతీయకూడదు అనే పేరుతో ...గత ఒప్పందాల జోలికి వెళ్ళటం లేదు అని పైకి చెపుతున్నా కూడా తెర వెనక ప్రధాన కారణం జరిగిన రెండు వేల కోట్ల రూపాయల డీల్ మాత్రమే అన్నది అధికారుల్లో హాట్ టాపిక్ గా మారింది. వీటికి సంబంధించి త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా వాళ్ళు చెపుతుండటం విశేషం. ప్రతిపక్షంలో ఉండగా చెప్పే వాటికీ ఏ మాత్రం సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చిన నాయకులు వ్యవరిస్తుండంతో ప్రజలు కూడా ఏ పార్టీ అయినా అంతే అనే పరిస్థితి వచ్చేశారు. కాకపోతే ఎవరు ఎక్కువ..ఎవరు తక్కువ అన్న దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Tags:    

Similar News