పవన్ వర్సెస్ వైసీపీ సర్కారు ఓ వైపు. ప్రభుత్వం నుంచి ధరల పెంపుతోపాటు వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు పొందాలని నిర్మాతలు మరో వైపు. వెరసి పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేయాలని కొంత మంది ప్రయత్నం. అయినా నిర్ణయం అందరికీ ఒకేలా ఉంటుంది కదా. వ్యక్తులకు ఓ విధానం సాధ్యం కాదు కదా. అకస్మాత్తుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు బుధవారం నాడు ఏపీ సమాచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి నాని తెలిపారు.ఆన్‌లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి చెప్పారు. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని మంత్రి నాని తెలిపారు. పరిశ్రమ అంతా ఐకమత్యంతోనే ఉందని పేర్కొన్నారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని నిర్మాతలు చెప్పినట్లు వివరించారు.
దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు. కరోనాతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటివరకు థియేటర్‌లో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాల్సిందిగా కోరారని వెల్లడించారు. వారి విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీ నటుడి వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని వివరించారు.పవన్ అభిప్రాయలకు తాము అనుకూలంగా లేమని, పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి నాని తెలిపారు. అలాగే చిరంజీవి కూడా తనతో మాట్లాడరని, ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్దమని నిర్మాతలు చెప్పారని మంత్రి చెప్పారు. మంత్రితో జరిగిన సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, బన్నీ వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.