టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షంలో ఉంటే కార్యకర్తలు..నాయకులు కావాలి. అధికారంలోకి వస్తే ఐఏఎస్ లు చాలు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా ఐఏఎస్..ఐపీఎస్ లతోనే వేయించుకోండి. టీడీపీ గెలిచిన ప్రతిసారి ఓటమికి కారణం మీరు...మీ నిర్ణయాలే. ఓడిన ప్రతిసారి గెలుపుకు కారణం కార్యకర్తలు...అభిమానుల కష్టమే. ఇలా ఒకటి కాదు...రెండు కాదు టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జనాల్లో వ్యతిరేకత మొదలైంది..ఇలాగైతే ఈ సారి కష్టమే అంటూ ఫైర్ అవుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, టీడీపీ కి జీ వీ రెడ్డి రాజీనామా..ఆ వెంటనే ఆమోదం వంటి పరిణామాలపై టీడీపీ అభిమానులు..ఎప్పటి నుంచో సోషల్ మీడియా లో పార్టీ కు అనుకూలంగా పని చేస్తున్న వాళ్ళు మండిపడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సారి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని చెప్పారు అని..ఇదేనా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓటింగ్ కు వెళ్ళం అని కొంత మంది...నోటా కు వేస్తాం అంటూ కూడా మరికొంత మంది పోస్ట్ లు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ కి తాజా పరిణామాలు ఒకింత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. ఈ మధ్య కాలంలో టీడీపీ కి వ్యతిరేకంగా అది కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను టార్గెట్ గా చేసుకుని సొంత పార్టీ అభిమానులే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం రాజకీయంగా కూడా తీవ్ర చర్చ చర్చనీయాంశంగా మారింది. జీ వి రెడ్డి బహిరంగంగా మాట్లాడటం తప్పు అయితే ఆ విషయాన్ని చంద్రబాబు పిలిచి చెప్పి ఉండొచ్చు..మందలించి ఉండొచ్చు. కానీ ఆయన అక్రమంగా కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించమని..సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని చూడటం తప్ప జీ వి రెడ్డి ఏమీ అదనపు సౌకర్యాలు..హోదాలు కూడా కోరుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని చెప్పి..ఇప్పుడు వాటిని వెలుగులోకి తెచ్చిన సొంత పార్టీ చైర్మన్ ను పదవి నుంచి దిగిపోయేలా చేశారు అనే విమర్శలు టీడీపీ మూటకట్టుకుంటోంది. జగన్ మోహన్ రెడ్డి పాలనా కాలంలో సాగిన అవినీతికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కూటమి సర్కారు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ...పలు కీలక విషయాల్లో కొంత మంది కీలక నేతలు సెటిల్మెంట్స్ చేసుకున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను కూడా వాళ్ళు సోషల్ మీడియా లో బహిరంగంగానే షేర్ చేస్తూ టీడీపీ అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా చాలా మంది టీడీపీ అభిమానులు అధిష్టానం తీసుకునే కీలక నిర్ణయాలను తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలనే టీడీపీ కి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కంటే టీడీపీ అభిమానుల నుంచి పెద్ద సవాల్ ఎదురవుతోంది. అయినా సరే అధిష్టానం వీటిని లైట్ గా తీసుకుంటూ తాను అనుకున్నట్లు చేసుకుంటూ వెళుతోంది. అయితే ఈ ప్రభావం రాజకీయం గా ఉంటుందా లేదా తేలాలంటే ఇంకా చాలా సమయమే ఉంది. అయితే అగ్రనేతలు మాత్రం ఇప్పుడు తమను ఎవరూ ఏమీ చేయలేరు అనే ధోరణితో వ్యవహరిస్తూ పలు విషయాల్లో జగన్ మోడల్ ను ఫాలో అవుతున్నారు అనే చర్చ కూడా సాగుతోంది.