చంద్రబాబు సిఫారసు!

Update: 2025-12-13 05:08 GMT

మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏసిజీ) పదవి ఇవ్వనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ వర్గాల నుంచి. సీనియర్ లాయర్ ...సుదీర్ఘకాలం తెలుగు దేశం లీగల్ వ్యవహారాలను చూసిన రవీంద్ర కుమార్ కు తెలుగు దేశం పార్టీ గతంలో రాజ్య సభ సభ్యత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వాలే కొలువు తీరి ఉన్నాయి. రాష్ట్రంలో ఇస్తున్న నామినేటెడ్ పోస్ట్ ల్లో కూడా బీజేపీ బలం ఆధారంగా ఆ పార్టీ కి కొన్ని పదవులు ఇస్తున్నారు. కానీ కేంద్రం విషయానికి వస్తే టీడీపీ కి నామినేటెడ్ పోస్ట్ లో పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో చోటు కాకుండా ఇప్పటి వరకు ఆ పార్టీ కి దక్కిన కీలక పదవి అంటే మాజీ మంత్రి...సీనియర్ నేతగా ఉన్న అశోక్ గజపతి రాజు ను గోవా గవర్నర్ గా నియమించిన విషయం తెలిసిందే. త్వరలోనే అంటే వచ్చే ఏడాది టీడీపీ తరపున మాజీ ఎంపీగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ కు అడిషనల్ సొలిసిటర్ జనరల్ పోస్ట్ దక్కే అవకాశం ఉంది అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

                                ఆయనతో పాటు ఇతర కీలక నేతలు కొంత మంది కేంద్రంలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి చంద్రబాబు ఎవరి పేర్లు దేనికి సిఫారసు చేస్తారో చూడాలి. అయితే రవీంద్ర కుమార్ పోస్ట్ విషయంలో ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు ఈ సారి అటు కేంద్రంతో ఇటు ప్రధాని మోడీ తో వ్యవహరిస్తున్నారు అనే చర్చ సాగుతోంది. ప్రధాని దగ్గరకు వెళ్లి నామినేటెడ్ పోస్ట్ లు వంటి వాటిపై ఫోకస్ పెట్టే కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు అనే చర్చ సాగుతోంది. మరీ అవసరం అనుకుంటే తప్ప...పెద్దగా పోస్ట్ ల విషయంలో ఆయన సిఫారసులు చేయకపోవచ్చు అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News