టీడీపీ నేతలపై వైసీపీ విమర్శలు చేస్తుంది. వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు. ఏపీలో ఇవి చాలాసార్లు హద్దులు దాటుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ నేతలు అయితే మరింత దారుణంగా బూతుల భాషతోనే విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ కూడా సీఎం జగన్ టార్గెట్ గా పరుష విమర్శలే చేస్తుంది. ఈ విషయంలో పోటీ సాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో వైసీపీ నేతలు నారా లోకేష్ ను పప్పు పప్పు అంటూ విమర్శించే వారు. దీనికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చేవారు. వైసీపీ నేతలు నారా లోకేష్ ను పప్పు అంటే..టీడీపీ నేతలు జగన్ ను గన్నేరు పప్పు అంటూ కౌంటర్ ఇచ్చేవారు. ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే లోకేష్ ను పప్పు అంటూ టార్గెట్ చేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వైసీపీ నేతలు చేసిన పప్పు విమర్శలను టీడీపీ పార్టీ అధికారిక పత్రిక చైతన్యరథం ఎండార్స్ చేసినట్లు ఏకంగా తన పత్రికలోనే లోకేష్ ను పప్పుగా అభివర్ణించటం ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతోంది.
పప్పు ఆరోగ్యకర ఆహారం దాని వల్ల ఎవరికీ నష్టం లేదు అంటూనే...ప్రపంచంలోనే పేరెన్నికగన్న స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో డిగ్రీ సాధించాడు..క్రమం తప్పకుండా ఆస్తుల ప్రకటన చేస్తున్నాడు అంటూ రాసుకొచ్చింది. ఇది అంతా లోకేష్ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ రెడ్డి లాంటి గన్నేరు పప్పు మాత్రం ప్రాణాంతకమైనది..ఏమి చదివారో చెప్పుకోలేని దుస్థితి. పదో తరగతి ప్రశ్నాపత్రాలు కొట్టేసిన చరిత్ర. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు కొట్టేసిన చరిత్ర. తాత తండ్రుల నుంచి అంతా నేరమయ జీవనమే..ఫాక్ష్యన్ చరిత్ర అంటూ రాసుకొచ్చింది. జగన్ పై టీడీపీ గతంలో చాలాసార్లు ఈ విమర్శలు చేసింది. అయితే సొంత పార్టీ నేతకు వైసీపీ ఇచ్చిన బ్రాండ్ ను టీడీపీ ఓన్ చేసుకున్నట్లు పప్పు బ్రాండ్ కు ఎండార్స్ చేసినట్లు వ్యవహరించటం ఏమిటో అర్ధం కావటంలేదని టీడీపీ నేతలే ఇది చూసి అవాక్కు అవుతున్నారు. పార్టీ పత్రిక చైతన్య రథం08.09.2022 సంచికలో ఈ టేబుల్ ను ముద్రించారు.