ఇవేనా ప్రాధాన్యతలు!

Update: 2025-12-12 08:29 GMT

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం గురువారం నాడే జరిగింది. ఇందులో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి విదేశీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ డుమ్మా కొట్టారు. విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గ సమావేశానికి రాలేదు సరే. కానీ మంత్రి వర్గ సమావేశం ముగిసిన మరుసటి రోజే అంటే శుక్రవారం ఉదయానికే ఆయన వైజాగ్ లో ల్యాండ్ అయ్యారు. కారణం దిగ్గజ ఐటి కంపెనీ కాగ్నిజెంట్ తో పాటు మొత్తం తొమ్మిది ఐటి, ఐటి ఆధారిత కంపెనీల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంది కాబట్టి. ఈ వ్యవహారం చూసి క్యాబినెట్ సమావేశాలు అంటే కూడా ఏదో ఫ్యామిలీ ఎఫైర్ లా మారింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ఇటీవల అమెరికా తో పాటు కెనడా లో పర్యటించి వచ్చారు. పోనీ ఇదేమైనా ఒప్పందాలు చేసుకోవటానికి వెళ్లారు కాబట్టి రాలేకపోయారు అనటానికి కూడా ఏమి లేదు.

                                     నారా లోకేష్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయి వచ్చారు. భవిష్యత్ నేతగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్ ఇలా క్యాబినెట్ మీటింగ్ కి డుమ్మా కొట్టి మరుసటి రోజే మరో కార్యక్రమంలో పాల్గొనటం ఏ మాత్రం మంచి సంకేతం పంపదు అని టీడీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఏ మంత్రి క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టినా దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ రొటీన్ పర్యటనలకు క్యాబినెట్ సమావేశాలు క్లాష్ కాకుండా షెడ్యూల్ చేసుకోవాలి కానీ...క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ...ఆ వెంటనే మరో సమావేశంలో పాల్గొంటే ఇది సరైన విధానం కాదు అని అధికార వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

                                       ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పలు ఐటి కీలక సంస్థలకు వైజాగ్ లో కారు చౌకగా భూములు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇందులో సత్వ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. సత్వ తనకు కేటాయించిన భూమిలో కొంత ఐటి స్పేస్ డెవలప్ చేసి..మిగిలిన మొత్తంలో రెసిడెన్సియల్ స్పేస్ డెవలప్ చేసి అమ్ముకుకోనుంది. వైజాగ్ లాంటి సిటీ లో నామమాత్రపు రేట్ల కే భూములు కేటాయించటంతో పాటు కంపెనీలు కోరినట్లు పలు రాయితీలు ఇచ్చుకుంటూ తమ వల్లే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అని ఒక వైపు చంద్రబాబు నాయుడు...మరో వైపు నారా లోకేష్ లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News