సంస్కరణల్లో భాగంగానే పన్నుల సవరణ

Update: 2021-03-04 15:40 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పన్నుల పెంపు వ్యవహారం కీలకంగా మారింది.తెలుగుదేశం చంద్రబాబునాయుడితోపాటు ఆ పార్టీ నేతలు వైసీపీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే పన్నులు ఎడాపెడా పెంచుతారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ ఓటర్లను కోరుతున్నారు. ఈ ప్రచారంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనకు వరుసగా ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే దర్పనమన్నారు. సీఎం జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసించారు కాబట్టే మున్సిపల్‌ ఎన్నికల్లో 20, 797 వార్డులకు గాను 571 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ఆధారంగానే పన్నులపై నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

పన్నులు పెంచుతామంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, సీఎం జగన్‌ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేసిన సంస్కరణల్లో భాగంగా చట్టం చేశామే కానీ, చంద్రబాబులా ఇష్టారాజ్యంగా పన్నులు పెంచలేదని తెలిపారు. పట్టణ ప్రజల వైద్య అవసరాలు తీర్చే నిమిత్తం సీఎం జగన్ చేతుల మీదుగా త్వరలో 550 అర్బన్ క్లినిక్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాడు నేడు పథకం కింద స్కూల్‌లు అభివృద్ధి బాట పడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను అభ్యర్ధించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం జరుగనున్న రేపటి బంద్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు...దాని కోసం ఏమి చేయాలో అన్నీ చేస్తామని వివరించారు.

Tags:    

Similar News