చంద్రబాబు దృష్టి వెళ్లకుండా అధికారుల జాగ్రత్తలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సారి పాలన పూర్తిగా పట్టుతప్పింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఎవరిష్టం వాళ్ళు అన్నట్లు వ్యవహరిస్తున్నారు...జవాబుదారీతనం...బాధ్యత అన్నది మచ్చుకు కూడా కనిపించటం లేదు అన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పలు అధికార కేంద్రాలు ఉండటంతో ఎవరికీ తోచింది వాళ్ళు చేస్తున్నట్లు ..అసలు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో కీలక స్థానాల్లో ఉన్న వాళ్లకు కూడా తెలియకుండానే పలు వ్యవహారాలు సాగిపోతున్నాయి అని చెపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం అంటూ పీ 4 విధానాన్ని తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ విధానం కింద సంపన్నుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఎంపిక చేసిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న విషయం తెలిసిందే.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి భారీ భారీ కాంట్రాక్టు లు దక్కించుకున్న కొన్ని కంపెనీలు..కార్పొరేట్ సంస్థలు దీని కోసం కొంత మేర విరాళాలు ఇచ్చాయి. దీని కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర ఫౌండేషన్ సీఈఓ గా సి హెచ్. నరేష్ కుమార్ ను నియమించింది. అంతే కాదు జీరో పావర్టీ విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా సీఈఓ నరేష్ కుమార్ ను గత ఏడాది సెప్టెంబర్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు అనుమతి కూడా ఇచ్చింది. ఒక అధికారి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వటం పెద్ద వింత కాకపోయినా కూడా అసలు సంగతి ఇక్కడే ఉంది. అదేంటి అంటే ఆయన విదేశీ పర్యటన ఖర్చులు మొత్తం స్పాన్సరింగ్ ఏజెన్సీ ఎక్విప్ టీవీ పెట్టుకుంటుంది అని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం వెళ్ళేటప్పుడు ఆ టూర్ విదేశీ ఖర్చులను ప్రైవేట్ సంస్థలతో పెట్టించటం ఏ మాత్రం సరికాదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇది ఒక అంశం అయితే స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్ ఫౌండేషన్ సీఈఓ గా ఉన్న నరేష్ ఈ కార్యక్రమం అమలు కోసం వచ్చిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ఫండ్స్ ను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు అధికారులు చెపుతున్నారు. అది కూడా కోట్ల రూపాయల మేర ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం చేశారు అని..తర్వాత ఆయన విధులకు దూరంగా ఉండటంతో ఆయన్ను పక్కకు తప్పించారు అని..ఇది అంతా రహస్యంగా ఉంచారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.
ఈ మొత్తం విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి వెళ్లకుండా ఆర్థిక శాఖ అధికారులతో పాటు సీఎంఓ అధికారులు కూడా ప్రయత్నించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సిఎస్ఆర్ కింద వచ్చిన పేదలకు దక్కాల్సిన నిధులను కూడా కొంత మంది అధికారులతో ఆయన కుమ్మక్కు అయి పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తే కళ్ళు తిరిగే రీతిలో అసలు విషయాలు బయటకు వస్తాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరినైతే నమ్మి ఈ పీ 4 బాధ్యతలు అప్పగించారో వాళ్ళు కూడా సీఎం కు అసలు విషయం చేరకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెపుతున్నారు. చివరకు పేదల కోసం తలపెట్టిన ప్రోగ్రాం నిధులను కొంత మంది అధికారులతో కలిసి సీఈఓ పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఈ వ్యవరంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.