ఏపీ లో కూటమి నేతలు తమకు తాము సర్టిఫికెట్స్ ఇచ్చుకుంటారు. తాము చాలా మంచి నేతలం...తమది మంచి ప్రభుత్వం అని. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి మాత్రం అందుకు బిన్నంగా ఉంది అనే చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి చెందిన సన్నిహిత విద్యుత్ కంపెనీలతో సెటిల్ మెంట్స్ . విద్యుత్ బిల్స్ చెల్లింపుల విషయంలో సెటిల్ మెంట్స్. లిక్కర్ స్కాం లో ఒక కీలక వ్యక్తితో సెటిల్మెంట్. ఇసుక విషయంలో ఇదే తరహా మోడల్. బయట ప్రజలకు పెద్దగా ప్రభుత్వంలో జరిగే కొన్ని విషయాలు ఏమీ లోతుగా తెలియకపోవచ్చు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే లకు..పార్టీ నాయకులకు తెలియకుండా ఉండవు కదా. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వంలోని ఒక కీలక యువ మంత్రి, ఆయన టీం మొత్తం ఇదే పనిలోకి దిగిపోయింది. వరస పెట్టి వేల కోట్ల సెటిల్ మెంట్స్ కు శ్రీకారం చుట్టింది. మరో వైపు ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం జైలుకు వెళ్లి...కేసు లు ఎదుర్కొన్న నాయకులకు పార్టీ, ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వటం కూడా గగనం అయిపొయింది. సీనియర్ల పరిస్థితి అయితే మరీ దారుణం. అంటే కష్టపడ్డ నాయకులకు పదవులు లేవు...కనీస గౌరవం కూడా దక్కటం లేదు. ఆ యువ మంత్రి ఎవరైనా సరే డోంట్ కేర్ అంటూ అంతా తానే నడిపిస్తున్నారు. అధినేతను కూడా కొన్ని విషయాల్లో లెక్కచేయటంలేదు అని పార్టీ నాయకుల్లోనే ప్రచారం జరుగుతోంది.
ఇవన్నీ గమనించే కొంత మంది ఎమ్మెల్యేలు...వచ్చీ రాగానే అసలు వాళ్లే ఇంత దారుణంగా దోపిడీకి తెగబడుతుంటే ..తమ స్థాయిలో తాము చేసుకుంటే తప్పేమి ఉంది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. ఇదే ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అటు మద్యం, ఇటు ఇసుక వంటి విషయాల్లో కట్టుతప్పటానికి కారణం అవుతుంది అని చెపుతున్నారు. తర్వాత సంగతి తర్వాత...ముందు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎంత వీలు అయితే అంతా లాగించేటమే అన్న చందంగా అటు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వెళ్ళింది అని...దీన్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్ లో భారీ మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుంది అన్న భయం టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తే పైకి ఏవో మాటలు చెప్పటం తప్ప పరిస్థితులను సరిదిద్దే ఛాన్సులు కనిపించటం లేదు అన్నది కొంత మంది నాయకుల మాట. గత ప్రభుత్వం లో అడ్డ గోలుగా తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవటం మానేసి...వాళ్ళతో కలిసి సెటిల్ మెంట్స్ చేసుకోవటం టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం మిగుడుపడటం లేదు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఈ పరిస్థితి చాలా మంది నేతలను షాక్ కు గురిచేస్తోంది.