వైసీపీ అంటే ఓన్లీ జగనేనా ?

Update: 2024-01-26 11:35 GMT

వైసీపీ అంటే ఓన్లీ జగనా?. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రజలకు ఇదే సంకేతం ఇవ్వాలని నిర్ణయించుకున్నారా?. వై ఎస్ షర్మిలకు సంబదించిన వ్యవహారంలో అయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. గత నాలుగున్నర సంవత్సరాలకు పైగా జగన్ సర్కారు కు సంబంధించి అది ప్రభుత్వ నిర్ణయం అయినా..పార్టీ నిర్ణయం అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఒక్క సజ్జల మాత్రమే. మంత్రులను పక్కన పెట్టుకుని కూడా ఆయనే విధాన నిర్ణయాలు ప్రకటించిన సందర్భాలు ఎన్నో. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా షర్మిల చేసిన విమర్శలకు సజ్జల కౌంటర్ ఇస్తూ కుటుంభం పదవులు పంచుకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అంటూ ప్రశ్నలు సంధించారు. వై ఎస్ షర్మిల ఏదో పదవులు అడిగితే జగన్ ఇవ్వనందునే ఆమె ఇప్పుడు విమర్శలు చేస్తున్నట్లు అర్ధం వచ్చేలా అయన ఈ మాటలు మాట్లాడారు. కాసేపు ఇదే నిజం అనుకుందాం. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇదే జగన్ కడప ఎంపీ పోటీ చేసి గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, జగన్ కడప ఎంపీ. అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరూ పదవులు తీసుకోవచ్చు. కానీ వైసీపీ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ జగన్ అన్న మాట. ఇతరులకు ఏమైనా పదవి ఇవ్వాల్సి వస్తే మాత్రం కుటుంబం పదవులు పంచుకుంటే అది ప్రజాస్వాయం ఎలా అవుతుంది అంటూ పెద్ద పెద్ద మాటలు చెపుతారు అన్న మాట.

                                          ఇదే సజ్జల అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సజ్జల తనయుడు సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయన కుటుంబం వాళ్లే రెండు పోస్ట్ లు చేయవచ్చు కానీ..ఇతరుల దగ్గరకు వచ్చే సరికి మాత్రం ప్రజాస్వామ్యం.. విలువలు..లెక్కలు గుర్తుకు వస్తాయన్న మాట. ఎక్కడివరకో ఎందుకు శ్రీకాకుళం జిల్లా దగ్గరి నుంచి మొదలు పెడితే అటు ధర్మాన కుటుంబం, విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం నుంచి ఎంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు...ఇప్పుడు కొత్తగా బొత్స ఫ్యామిలీ కి ఎన్ని టికెట్స్ ఇచ్చారో సజ్జలకు తెలియదా అని ఒక వైసీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు వైసీపీ లో చాలా వరకు ఫ్యామిలీ ప్యాక్ లు గా ఉన్న విషయం తెలిసిందే. షర్మిల విషయంలో సజ్జల చేసే విమర్శలు వైసీపీ కి మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయనే చర్చ వైసీపీ నేతల్లో సాగుతోంది. జగన్ విషయంలో షర్మిల సూటిగా వేస్తున్న ప్రశ్నలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జగన్ కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవడు...వై ఎస్ లా ప్రజలను కలిసిన దాఖలాలు లేవు అంటూ ఆమె విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి అధికార పార్టీ ని ఇరకాటంలోకి నెడుతున్నాయి.Full View

Tags:    

Similar News