ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు

Update: 2021-01-30 11:51 GMT

పంచాయతీ ఎన్నికల వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించాలన్న తన ఆదేశాలు అమలుకాకపోవటంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. తన ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో పెద్ద సంచలనంగా మారబోతుంది. ప్రభుత్వం తన ఆదేశాలు అమలు చేయకపోతే ఎస్ఈసీ రమేష్ కుమార్ మరోసారి కోర్టును ఆశ్రయించి.. ధిక్కరణ పిటీషన్ వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్ అంశంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు సంబంధించి కూడా సీఎస్ కు మరో లేఖ రాశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఈ కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని పట్టణ ప్రాంతాలకు కాదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించే మంత్రులు అధికారిక వాహనాలు వాడకూడదన్నారు. అదే సమయంలో వారితో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది తప్ప అధికారులెవరూ మంత్రులతో ఉండకూడదన్నారు. ఎన్నికల సమయంలో సలహాదారులు కూడా ప్రభుత్వ వాహనంలో పార్టీ కార్యాలయాలకు వెళ్ళకూడదని తెలిపారు. ఇలా చేస్తే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించటమే అవుతుందని అన్నారు.

Tags:    

Similar News