రాసి పెట్టుకోండి. ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదు. రాదు...రానివ్వం. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ చెపుతున్న మాటలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా అని భయపడుతున్నారు అని...ఇప్పుడు వారి భయాన్ని పోగొట్టాం అంటూ కూడా చంద్రబాబు, నారా లోకేష్ లు చెపితే...తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ మళ్ళీ రాదు అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ళు చెపుతున్న దానికి వాస్తవానికి మధ్య తేడా ఉంది అనే అంశం ఇప్పుడు బయటపడింది. గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ లో దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే.
దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయటమే కాకుండా..కోటి సంతకాల ఉద్యమం అంటూ కూడా ఒక కార్యక్రమం చేపట్టి గవర్నర్ కు దీనిపై ఒక వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా జగన్ మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే పీపీపీ విధానం కింద కాలేజీలను తీసుకున్న వాళ్ళను జైల్లో పెడతామని హెచ్చరించారు. అంతే కాకుండా ఇలా తీసుకున్న వాళ్ళు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని కూడా బెదిరించారు జగన్. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మొత్తం పీపీపీ విధానం కింద అప్పగించేందుకు నాలుగు కాలేజీ ల విషయంలో నోటిఫికేషన్ జారీ చేస్తే ఒక్క కాలేజీ కు మాత్రమే బిడ్స్ దాఖలు అయ్యాయి. అది ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి. దీని కోసం కిమ్స్ బిడ్స్ సమర్పించింది. మార్కాపురం తో పాటు మదనపల్లి, పులివెందుల కాలేజీలకు మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలను షాక్ కు గురిచేసింది.
తాజా పరిణామాలతో పెట్టుబడిదారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాటలను నమ్మటం కంటే జగన్ బెదిరింపులకు ఎక్కువ భయపడినట్లు కనిపిస్తోంది అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. కారణాలు ఏమైనా కూడా పీపీపీ కాలేజీల విషయంలో ఏకంగా మూడు కాలేజీలకు ఒక్క బిడ్ రాకపోవటం....వచ్చిన దానికి కూడా సింగిల్ బిడ్ రావటం కచ్చితంగా రాంగ్ సిగ్నల్ పంపినట్లు అయింది అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. తమపై నమ్మకంతోనే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేష్ లు ఇటీవల వరకు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు.కానీ అసలు విషయం ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో బయటపడింది. మరో వైపు పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాయితీలు, ప్రోత్సహకాల విషయంలో ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్స్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయటంతో పాటు సావరిన్ గ్యారంటీ కూడా కలిపిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ రెండింటి వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. వాస్తవాలు ఇలా పెట్టుకుని తమ విధానాలు..తమ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ మెడికల్ కాలేజీల ఉదంతం చూస్తే చంద్రబాబు..పవన్ మాటలు ఎవరూ నమ్మటం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటికంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులు ఎక్కువ పని చేసినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకోవటానికి ప్రైవేట్ సంస్థలు ఏవీ పెద్దగా ముందుకు రాకపోవటంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారబోతోంది. ఏది ఏమైనా ఈ పరిణామం రాజకీయంగా కూటమికి డేంజర్ సిగ్నల్ అనే చర్చ తెరమీదకు వచ్చింది.