ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం నాడు కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో టీఆర్ఎస్ కొత్తగా పార్టీ పెట్టడం ఎందుకు...అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు రాష్ట్రాలు కలిపేస్తే అప్పుడు ఎక్కడంటే అక్కడ పోటీచేయవచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది కెసీఆర్, జగన్ ల ' ఉమ్మడి కుట్ర' అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందిస్తూ తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నందునే అక్కడ కొత్త పార్టీలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే ఓ ఐపీఎస్ అధికారి పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టారన్నారు. మరికొన్ని పార్టీలు కూడా వచ్చాయన్నారు. ఏపీలో వైసీపీకి 151 సీట్లు వస్తే రాజకీయ శూన్యత ఎక్కడ ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజల గుండెల్లో శూన్యత లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆరే నదీ జలాల వినియోగం విషయంలో మాట తప్పారని ఆరోపించారు. దిండి-పాలమూరు ప్రాజెక్టు నుంచి తాగునీరు పేరుతో నీటిని సాగునీటి అవసరాలకు మళ్ళించారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరమో..విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు. నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలతో సంచలనాల్లో ఉండాలనుకునే రేవంత్ ఇలాగే ట్వీట్లు చేస్తారని అన్నారు.