పోలవరం ప్రాజెక్టు 2022 ఖరీఫ్ కు రెడీ

Update: 2020-11-09 15:01 GMT

పోలవరం ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి కేంద్రం, ఏపీ సర్కారుల మధ్య తకరారు నడుస్తోంది. అసలు కేంద్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత మొత్తంలో నిధులు విడుదల చేస్తుందో క్లారిటీ లేదు. ఏపీ సర్కారు మాత్రం సవరించిన ధరల ప్రకారమే నిధులు ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబడుతోంది. ఇది ఏమి అవుతుందో తెలియదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2022 ఖరీఫ్ సీజన్‌కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. 2021లో ఆరు ప్రాజెక్ట్‌ లను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కృష్ణా నది దిగువ బ్యారేజీలకు వేగవంతంగా అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి చేస్తాం.

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.40 వేల కోట్లతో కరువు నివారణ చర్యలు చేపడుతున్నాం అని సీఎం జగన్‌ తెలిపారు. సోమవారం నాడు సీఎం జగన్ సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే ఆయన పోలవరం అంశాన్ని ప్రస్తావించారు. కొత్తగా 460 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్‌-2 నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కాలువ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, వింజమూరు, దుత్తల్లూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు నీరు పుష్కలంగా అందుతుంది. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News