ఎందుకీ ఈ మార్పు!

Update: 2025-11-11 12:20 GMT

ఈ ఐదేళ్లే కాదు. మరో పదేళ్లు కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడే ఉండాలి. చంద్రబాబు విజన్ కు అనుగుణంగా తాము అంతా పని చేసుకుంటూ వెళతామని జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లోపల...బయట కూడా పలు మార్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు కు తాము మద్దతు ఇచ్చిందే ఆయన అనుభవం...విజన్ చూసి అని కూడా చెప్పారు. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ స్వయంగా విజనరీ అని పొగిడిన చంద్రబాబుకే క్యాబినెట్ సాక్షిగా సూచనలు..సలహాలు ఇచ్చినట్లు మంగళవారం నాడు ప్రధానంగా మీడియాలో వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి కౌంటర్ గా చంద్రబాబు కు ఈ సూచన చేశారా అనే చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతోంది. ఇక్కడ అత్యంత కీలక విషయం ఏమిటి అంటే అటు చంద్రబాబు నాయుడు అయినా..ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా కూడా కూటమి పార్టీ లకు చెందిన కొంత మంది ఎమ్మెల్యే ల పని తీరు ఏ మాత్రం బాగాలేదు అని అధికారికంగా చెపుతున్నట్లు అయింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలు అయిన టీడీపీ , జనసేన లకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున భూ కబ్జాలు...సెటిల్ మెంట్స్ ఆరోపణలు వస్తున్నాయి.

                                               ప్రజల ఆస్తులకు చెందిన వివాదాల్లో కూడా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎంతో సీరియస్ గా ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇందుకు చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు మాత్రం విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకునున్నట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల తప్పులను సరిద్దాల్సిన బాధ్యత ఇన్ ఛార్జ్ మంత్రులదే అని ఆయన అందులోనే చెప్పారు. అప్పటికి వాళ్ళు మాట వినకపోతే తన దృష్టికి తేవాలన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే స్వయంగా ముఖ్యమంత్రి పలు మార్లు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తేనే పట్టించుకోని ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జ్ మంత్రుల మాట వినటం అసలు జరిగే పనేనా?. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి ప్రభుత్వంలో ...పై స్థాయిలో జరిగే అక్రమాలు...అవినీతి వదిలేసి కేవలం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ లు పదే పదే ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తే వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు అని ఒక మంత్రి సందేహం వ్యక్తం చేశారు.

                                                          ఇది ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు కారణం అవుతుంది అని చెపుతున్నారు. ప్రభుత్వంలో అంటే ప్రధానంగా మున్సిపల్ శాఖ , విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, పారిశ్రామిక భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు..అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు...విమర్శలు వినిపిస్తున్నా కూడా ఒక్కటంటే ఒక్కసారి నోరు తెరవని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కట్టడి చేయాలని కోరటం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ల తప్పులను ఎత్తిచూపటాన్ని ఎవరూ కాదనరు...కానీ ప్రభుత్వంలో అసలు తప్పులే లేకుండా అత్యంత పారదర్శక పాలన సాగుతుంది అనే తరహాలో మాట్లాడంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంత మంది మంత్రులపైనే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం కిమ్మనటం లేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిజాయతీగా..నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంటే కింద ఉన్న వాళ్లకు గట్టి వార్నింగ్ లు ఇవ్వొచ్చు. కానీ పై స్థాయిలోనే ఎన్నో తప్పులు పెట్టుకుని..ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే వాళ్ళు వింటారా అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది లేవనెత్తుతున్న ప్రశ్న.

Tags:    

Similar News