ద‌స‌రా నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌స్సుయాత్ర‌

Update: 2022-06-10 14:49 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ యాత్ర‌ల సీజ‌న్ ప్రారంభం అయింది. ఇప్ప‌టికే అధికార వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ తిరుగుతోంది. మ‌రో వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఈనెల నుంచే జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏడాది పాటు ఆయ‌న ఈ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న త‌ల‌పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నట్లు జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 5న తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. అన్ని జిల్లాల్లోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌లు కొన‌సాగ‌నున్నాయి. ఈ మేర‌కు రూట్ మ్యాప్ ఖ‌రారు చేస్తున్నారు.

జగన్ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రణాళిక లేని పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకే చేతులు ఎత్తేశాడని విమర్శించారు. అందుకే వచ్చే మార్చి, ఏప్రిల్ లో జగన్ ఎన్నికలకు వెళతాడని, దీనిపై తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌స్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News