ఇది అంతా పాత విషయం. తాజాగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయంటూ సర్వేలు చెబుతున్నాయని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి రాజకీయంగా డ్యామేజ్ చేసే అంశమే. ఎందుకంటే పవన్ చేసిన వ్యాఖ్యల రీచ్ ఎక్కువగా ఉంటుంది..ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఆయన వ్యాఖ్యల ప్రభావం జనసేనకు లాభిస్తుందా..లేక తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చిపెడుతుందా అంటే అది ఎన్నికల సమయంలోనే తేలుతుంది. అదే సమయంలో సీఎం జగన్ రాజధానిపై మాటలు మార్చిన...మోసం చేసిన అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే విన్పించారు. పవన్ పాపులర్ హీరో కావటంతో ఇవి ప్రజల్లోకి చాలా వేగంగా వెళతాయి. టీడీపీ చేసే ప్రచారం కంటే పవన్ వ్యాఖ్యలు ప్రజలకు త్వరగా చేరువ అవుతాయని చెప్పొచ్చు. అందుకే అలా పవన్ వైసీపీ సీట్ల గురించి ప్రస్తావించిన వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు. కొత్త రాజకీయ చిలక అంటూ వైసీపీ సీట్లు సరే..ఈ జోస్యం చెప్పిన చిలక జనసేన ఎన్ని సీట్లలో పోటీచేస్తుందో చెప్పలేదా అంటూ ఎద్దేవా చేశారు. లేక చంద్రబాబు ఎన్ని ఇస్తే అన్ని సీట్లలో పోటీచేస్తారా అంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సీట్ల లెక్క ఏపీలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.