రెండు ఇళ్ళ మధ్యే రాష్ట్ర రాజకీయాలంటే కుదరదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం..వైసీపీ ఎదురుదాడి. గాంధీ జయంతి రోజు కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. పలు చోట్ల పోలీసులు అడ్డంకులు కల్పించే ఏర్పాట్లు చేసినా వాటిని అధిగమించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను అనుకున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవన్ శనివారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేసిన తర్వాత బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను యాక్షన్, కట్ అంటే వెళ్లిపోయే వాడిని కాదన్నారు. .తన సహనాన్ని పరీక్షించొద్దని, కనీసం రెండు దశాబ్దాలు తనతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రండి అని వ్యాఖ్యానించారు. నేను తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టలేనని బెట్టింగులు కట్టారు. నాపై నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇవి మెతక లీడర్లు ఉన్న రోజులు కావు. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు.
అందుకే రోడ్లు లేవు, జీతాలు, పెన్షన్లురావని విమర్శించారు. తాను బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాడిని కాదని, గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. కాపు, ఒంటరి, తెలగ, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో మార్పురాదన్నారు. నాలుగు కులాలు పెద్దన్నపాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రిఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది మొదలుకుని.. బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేంత వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి 'ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం.. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం' అంటూ పోలీసులకు సవాల్ విసిరారు. మరోవైపు.. అభిమానులు, కార్యకర్తలు భారీగానే సభకు తరలివచ్చారు.