అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఏకంగా 120 కోట్ల రూపాయల జరిమానా విధించింది. పోలవరంతోపాటు మూడు ప్రాజెక్టుల విషయంలో ఈ జరిమానా విధించారు. చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి 73.6 కోట్ల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, పురుషోత్తం పట్నం ప్రాజెక్టుకు సంబంధించి 24.56 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఈ జరిమానాలను మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించారు. ఏపీ కాలుష్య నియంత్రణా మండలికి ఈ జరిమానాలు కట్టాలన్నారు. విశేషం ఏమిటంటే ఈ మూడు ప్రాజెక్టులు కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రారంభం అయినవే. పర్యావరణ ఉల్లంఘణలపై అందిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.