ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. పంచాయతీ ఎన్నికలు ముందుకు సాగుతాయా?. లేక ఆగిపోతాయా?. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ జారీ కి రెడీ అయిపోయారు. మరో వైపు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగండి అంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీ సర్కారు, ఎస్ఈసీ మధ్య గ్యాప్ ఎవరూ పూడ్చలేనంత స్థాయికి చేరిపోయింది. ఈ దశలో సర్కారు లేఖను ఎస్ఈసీ రమేష్ కుమార్ పరిగణనలోకి తీసుకుంటారని అనుకోవటం అత్యాశే అవుతుంది. అయితే ఈ తరుణంలో కలెక్టర్లు, ఉద్యోగులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏ మేరకు సహకరిస్తారు?. సహకరించకపోతే సహజంగా రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్కారు కూడా ఈ విషయాన్ని తెగేదాకా లాగుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
అయితే ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయోనన్న ఆందోళన అధికార వర్గాల్లో నెలకొంది. శుక్రవారం నాడు ఎస్ఈసీ మందు హాజరుకావాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. ఐదు గంటల వరకూ రాకపోతే చర్యలు ఉంటాయంటూ మెమో కూడా జారీ చేశారు. ఎస్ఈసీ కార్యాలయంలో కూడా ఓ గంట పాటు అదనంగా ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీఎం జగన్ తో భేటీ తర్వాత ఎస్ఈసీకి నోట్ పంపారు. సుప్రీంకోర్టులో కేసు వేశామని..అక్కడ తీర్పు వచ్చేవరకూ ఆగాలని కోరారు. అయితే ఇది అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదనే సంగతి అందరికీ తెలిసిందే. ఏపీ సర్కారు ఇప్పుడు వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకే సారి నిర్వహించటం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికలు తప్పనిసరి అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలపివేయాల్సి వస్తుందని కోర్టుకు ప్రభుత్వం చెప్పనున్నది. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసేంత వరకు అయినా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం కోర్టుకు విన్నవించనున్నది. అయితే శనివారం నాడు పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. సీఈసీకి ఉండే అధికారాలే ఎస్ఈసీకి ఉంటాయని.. అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదని.. నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతే కాదు ఆయన పలు జిల్లాల కలెక్టర్లు, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేయాలని సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు. చూడాలి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.
.