దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కొద్ది నెలల క్రితమే దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎయిర్ బస్ కు చెందిన హెచ్ 160 హెలికాప్టర్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ముకేశ్ అంబానీ కొనుగోలు చేసినా హెలికాప్టర్ లో పన్నెండు మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఎయిర్ బస్ కు చెందిన హెచ్ 160 హెలికాప్టర్ బేసిక్ ధర కూడా 120 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని అంచనా. ఇప్పుడు ఇదే మోడల్ హెలికాప్టర్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపయోగం కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇప్పటి వరకు ఉపయోగించిన బెల్ హెలికాప్టర్ ప్లేస్ లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎయిర్ బస్ కు చెందిన హెచ్ 160 హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరాల కోసం కొత్త హెలికాప్టర్ ను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరగటంతో ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది.
పాత హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ఈ కొత్త హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నామని..అంతే తప్ప వైసీపీ ప్రచారం చేస్తున్నట్లు కొత్త హెలికాప్టర్ కొనలేదు అని తెలిపారు. అదే సమయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తగా అద్దెకు తీసుకున్న ఎయిర్ బస్ హెచ్ 160 హెలికాప్టర్ వల్ల ముఖ్యమంత్రి ప్రయాణ ఖర్చుల్లో 70 శాతం వరకు ఆదా అవుతుంది అని తెలిపింది. ఇదే హెలికాప్టర్ తో అమరావతి నుంచి నేరుగా శ్రీకాకుళం, చిత్తూర్ వరకు కూడా వెళ్ళవచ్చు అని వెల్లడించారు. ఈ హెలికాప్టర్ ఎంతో సురక్షితమైనది అని తెలిపారు.