Full Viewఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు కలిసి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టక పోయినా కూడా జనసేన, బీజేపీ లు మిత్ర పక్షాలుగానే ఉన్నాయి. గత నాలుగేళ్లుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మరో వైపు గత కొంత కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెలనివ్వను...వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ గెలుపును అడ్డుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా అయన చేస్తున్న వారాహి యాత్రలో కూడా అధికార వైసీపీ పై గతం కంటే విమర్శల డోస్ పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం వైసీపీ అధినేత, సీఎం జగన్ కు పూర్తి అండదండలు అందిస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ తరుణంలో జులై 18 న జరగనున్న ఎన్ డీఏ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం వచ్చింది. మిత్రపక్షంగా ఉన్న జనసేన ను పిలవటంపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాజకీయ వర్గాల్లో దీనిపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధానంగా ఇన్నేళ్ల తర్వాత మోడీ ఎన్ డీఏ సమావేశం ఏర్పాటు చేయటమే ఒక కీలక అంశంగా మారింది. దేశంలోని విపక్షాలు అన్ని మోడీ కి వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా మోడీ ఇమేజ్ తగ్గుతుంది అనే చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఒకటి...త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జోష్ కొనసాగే అవకాశం ఉంది అనే వార్తలు అటు మోడీ తో పాటు బీజేపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే పెద్దగా ఉనికిలో లేని ఎన్ డీఏ మీటింగ్ ఏర్పాటు..దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా పిలవటంతో బీజేపీ.. ముఖ్యంగా మోడీ వీక్ అయ్యారనే సందేశం ప్రజల్లోకి వెళుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇది అంతా ఒక ఎత్తు అయితే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జనసేన, బీజేపీ లు మాత్రమే కలిసి ముందుకు వెళ్దాం అని జనసేన కు సంకేతం ఇస్తారా..లేక టీడీపీ ని కూడా కలుపుకుని వెళ్దాం అని చెపుతారా అన్నదే ఇప్పుడు కీలక అంశం కానుంది. వచ్చే ఎన్నికల్లో కేవలం బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేయాలని బీజేపీ ప్రతిపాదిస్తే అది...పవన్ కళ్యాణ్ చెపుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని ప్రకటనకు విలువ లేకుండా పోతుంది. అప్పుడు క్లియర్ గా మోడీ కేవలం సీఎం జగన్ కు, వైసీపీ కి మేలు చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ తెరమీదకు వస్తుంది. దీనికి జనసేన అధినేత ఎంతవరకు ఓకే చెపుతారు ..కాదనే పరిస్థితి ఉంటుందా అన్నది వేచిచూడాల్సిందే. మరో వైపు కొంత మంది బీజేపీ నేతలే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగుతాయని చెపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ తో పొత్తు రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అనే చర్చ అటు టీడీపీ, జనసేనలో ఉన్నా కూడా కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటం ఒక్కటే దీనికి కారణం అనే వాదన తెర పైకి తెస్తున్నారు. ఎన్ డీఏ మీటింగ్ తర్వాత అయినా ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా లేదా అన్నది వేచూడాల్సిందే.