
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు ఏమి జరుగుతోంది?. గత కొంత కాలంగా అందరూ టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విజనరీ గా కీర్తిస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మేఘా కృష్ణా రెడ్డి ని..గ్రీన్ కో సీఈఓ అండ్ ఎండీ చలమల శెట్టి అనిల్ కుమార్ లు మార్గదర్శులుగా అభివర్ణిస్తున్నారు. ఇది ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా చేప్పట్టిన పీ 4 కార్యక్రమంలో వీళ్ళిద్దరూ భాగస్వాములు కావటమే. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎంపిక చేసిన పేద కుటుంబాలకు ఈ కంపెనీ లతో పాటు మరి కొంత మంది పారిశ్రామిక వేత్తలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఇలా సాయం చేసే వాళ్ళను మార్గదర్శులుగా పిలుస్తాం అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పై ఉన్న వివాదాలు అన్ని ఇన్నీ కావు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కే పట్టి సీమ ప్రాజెక్ట్ కేటాయించగా...దీనిపై ఎన్నో వివాదాలు తలెత్తాయి.
ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేఘా ఇంజనీరింగ్ పై విమర్శలు చేసిన జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కాంట్రాక్టర్ ను తప్పించి...ఇదే మేఘా కు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు అప్పగించారు. తర్వాత కూడా వేల కోట్ల రూపాయల పనులను జగన్ హయాంలో ఇదే సంస్థకు కట్టబెట్టారు. సీన్ కట్ చేస్తే రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి తో పాటు పవన్ కళ్యాణ్ శాఖ గ్రామీణ సరఫరా శాఖ లో కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి వేల కోట్ల రూపాయల పనులు కేటాయించారు. వీటిలో కూడా పెద్ద ఎత్తున గోల్ మాల్స్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు కూడా అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఈ పనుల కేటాయింపులు చేశారు అని అనధికారికంగా అంగీకరిస్తున్నారు. తెలంగాణ లో దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయల పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేఘా ఇంజనీరింగ్ పై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు.
మరో కంపెనీ గ్రీన్ కో ప్రాజెక్ట్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో ఈ సంస్థకు మేలు చేసేలా విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించారు అనే విమర్శలతో పాటు ఈ కంపెనీ అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండు సంస్థలు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు లు...ప్రాజెక్ట్ లు దక్కించుకుని...కొంత మొత్తం పీ 4 కింద సాయం చేసినందుకు వీళ్ళను మార్గదర్శులుగా పిలుస్తాము అని చెప్పటం ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుందో అర్ధం కావటం లేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇలా పీ 4 కింద సాయం చేసే కంపెనీలు రాష్ట్రంలో పొందిన కాంట్రాక్టు లు..ప్రాజెక్ట్ ల విలువ ఎంత..వీళ్ళు చేసిన సాయం ఎంత అన్నది ప్రభుత్వం బయటపెడుతుందో లేదో వేచిచూడాలి. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనం పొంది అందులో నుంచి కొంత మొత్తాన్ని సాయం చేస్తున్న కార్పొరేట్ కంపెనీల అధినేతలను మార్గదర్శులుగా ప్రచారం చేసి...దీని ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.