బెంగళూరు ను దేశ ఐటి రాజధానిగా పిలుస్తారు అనే విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది కూడా బెంగళూరు లోని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తారు. ఐటి రంగంలో బెంగళూరు ను బీట్ చేసేందుకు పలు నగరాలు పోటీ పడ్డా ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు అనే చెప్పొచ్చు. కొంతలో కొంత హైదరాబాద్ ఈ విషయంలో బెంగళూరు కు గట్టి సవాల్ విసురుతోంది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గత కొంత కాలంగా బెంగళూరు కంపెనీలను టార్గెట్ చేసుకుని పదే పదే చేస్తున్న ట్వీట్స్ రాజకీయం దుమారం రేపుతున్నాయి. లోకేష్ తీరుపై కర్ణాటక మంత్రులు ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించటం అంటే నారా లోకేష్ ట్వీట్లు చేయటం...కారు చౌకగా భూములు ఇవ్వటమే అన్నట్లు వ్యవహిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలు సైతం తమ బ్రాండ్ చూసి ఏపీకి పరుగులు తీస్తున్నాయి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఏపీకి పక్కనే ఉన్న బెంగళూరు పారిశ్రామికవేత్తలకు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పెట్టుబడుల వాతావరణం..పరిస్థితులు తెలియకుండా ఉంటాయా?.
బెంగళూరు లో ట్రాఫిక్ సమస్య ఉంది..లేక మరో సమస్య ఉంది అని మీడియాలో వార్తలు వస్తే చాలు వెంటనే నారా లోకేష్ వాటి ఆధారంగా ట్వీట్స్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడులు సాధించే దిశగా అయన ప్రయత్నం చేస్తే ఎవరూ దాన్ని తప్పుపట్టారు. కాకపోతే దీనికి అనుసరిస్తున్న విధానంపైనే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పై కర్ణాటక ఐటి మంత్రి ప్రియాంక్ ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన ఎకో సిస్టం ఉన్న వాళ్ళు బలమైన వాళ్లపై ఆధారపడటం సహజమే . ఇందులో తప్పేమి లేదు. కానీ నిరాశతో చేసే ఇలాంటి ప్రయత్నాలు చూస్తే అది మీ బలాన్ని కాదు...బలహీనతను సూచిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ను పరాన్న జీవి(పారసైట్)గా కూడా అభివర్ణించారు. లోకేష్ గత కొంత కాలంగా ఇలాగే బెంగళూరు కు సంబంధించి మీడియా లో ఏ వార్తలు వచ్చిన నారా లోకేష్ ట్వీట్స్ చేస్తున్నారు.
దీనికి కౌంటర్ గా ప్రియాంక్ ఖర్గే నారా లోకేష్ పై విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టి రాబోయే రోజుల్లో బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగంతో పాటు వార్షిక వృద్ధి రేట్ గురించి కూడా అందులో ప్రస్తావించారు. ఔటర్ రింగ్ రోడ్ సమస్యల వల్ల స్టార్ట్ అప్స్ తో పాటు పలు సంస్థలు ఉత్తర బెంగళూరు వైపు వెళుతున్నాయని పలు కంపెనీల పేర్లతో సహా క్రిస్టీన్ మాథ్యూ ఫిలిప్ అనే జర్నలిస్ట్ ఒక ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్..కంపెనీలు బెంగళూరు ఉత్తరం వైపు వస్తున్నాయని చెప్పటం మంచి పరిణామం..మరి కొద్దిగా ఉత్తరం వైపు వస్తే అనంతపురం వస్తుంది. అక్కడ తాము ప్రపంచ శ్రేణి ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టం ను అభివృద్ధి చేస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూనే ఘాటు వ్యాఖ్యలు చేశారు కర్ణాటక మంత్రి ఖర్గే. కర్ణాటక మంత్రి ట్వీట్ పై నారా లోకేష్ స్పందిస్తూ కొత్త రాష్ట్రంగా పెట్టుబడులు సాధించేందుకు తాము ప్రతి అవకాశాన్ని వెతుక్కుంటాం అని...రాష్ట్రాలు పెట్టుబడులు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నప్పుడు, భారతదేశం అభివృద్ధి చెందుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. దీంతో పాటు అహంకారం...రోడ్లపై గుంతలు ప్రయాణంలో జారిపోయే ముందే సరిచేయాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుందో చూడాలి.