ఆంధ్ర ప్రదేశ్ కు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరుకోవటం తప్పు కాదు. ఆ దిశగా గట్టి ప్రయత్నం చేయటం కూడా అభినందించదగ్గ విషయమే. కాకపోతే ఇందుకు అనుసరిస్తున్న విధానాలు కూడా ఇక్కడ ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. గత ఏడాది కాలంలో ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త పరిశ్రమలు తెచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం ఒకింత దూకుడుతోనే వెళుతుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చే కంపెనీలు పెట్టే పెట్టుబడుల కంటే ప్రభుత్వం ఇచ్చే భూములు...రాయితీలు చూస్తే వీటి వల్ల లాభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కంటే ఆయా కంపెనీలకే ఎక్కువ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక వైపు హిందీ జాతీయ భాష అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న వేళ కర్ణాటక ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్ట్ ఒకటి తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. రైతుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతకు తలొగ్గి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు విమానాశ్రయం వద్ద ఏరోస్పేస్ పార్క్ కోసం సేకరించదలచిన భూసేకరణ విషయంలో వెనక్కి తగ్గింది. ఈ పార్క్ కోసం తొలుత దేవనహళ్లి తాలూకాలో 1777 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించారు.
దీనికి వ్యతిరేకంగా అక్కడి రైతులు 1198 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఆందోళనకు తలొగ్గి ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇదే విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారికంగా ప్రకటించారు. స్వచ్ఛందంగా ఇచ్చే రైతుల దగ్గర భూమి తీసుకుంటామని..ఎవరైతే వద్దు అంటారో వాళ్ళ భూమిని తీసుకోము అని తెలిపారు. దీనికి సంబంధించి మీడియా లో వార్తలు వచ్చాయి. ఇది చూసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ ఐటి, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ తన అధికారిగాక పేస్ బుక్ పేజీ లో ఒక పోస్ట్ పెట్టారు. అందులోని సారాంశం ఇలా ఉంది. ‘ ప్రియమైన ఏరోస్పేస్ పరిశ్రమకు, ఇది విని విచారం కలిగింది. మీ కోసం నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మీరు అక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్ వైపు చూడకూడదా? మీ కోసం ఉత్తమమైన ప్రోత్సాహకాలతో కూడిన ఆకర్షణీయమైన ఏరో స్పేస్ పాలసీ రెడీగా ఉంది. బెంగళూరు పక్కనే 8000 ఎకరాల పైగా భూమి కూడా సిద్ధంగా ఉంది. మీతో ముఖాముఖి చర్చలకు త్వరలో కలుసుకోవాలని ఆశిస్తున్నాము.’ అంటూ రాసుకొచ్చారు. కర్ణాటక కు చెందిన ఏరోస్పేస్ ప్రతినిధులను ఏపీకి..బెంగళూరు దగ్గరలో ఉండే అనంతపురం రమ్మని పిలవటం కూడా తప్పేమి కాదు. కానీ కర్ణాటకలో రైతులు 1198 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని గౌరవించి వాళ్లకు అనుకూలంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి ..రైతులు ఏమైపోయినా పర్వాలేదు పరిశ్రమలు వస్తే చాలు అన్న చందంగా లోకేష్ పోస్ట్ పెట్టడం విమర్శలకు కారణం అవుతోంది. ఒకప్పుడు ఇదే లోకేష్ ఇండో సోల్ ప్రాజెక్టు ఫేక్ కంపెనీ అని చెప్పి..ఇప్పుడు మాత్రం ఆ సంస్థకు రైతులు ఎంత వ్యతిరేకిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ లో వేల ఎకరాలు ఇచ్చేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్ ల తీరు చూసుంటే రైతులు ఏమైపోయినా పర్వాలేదు తాము కోరుకున్న పరిశ్రమలకు మాత్రం భూములు ఇస్తే చాలు అన్న చందంగా వ్యవరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.