ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు గతానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్కో సారి వీళ్లిద్దరి పొగడ్తలు చూసి తెలుగు దేశం నాయకులు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. అసలు మోడీ దేశానికీ ఏమి చేశారు అని ఒకప్పుడు ఘాటుగా విమర్శించిన వీళ్ళే ఇప్పుడు మోడీ ప్రధానిగా ఉండటం దేశం చేసుకున్న అదృష్టం అన్నట్లు మాట్లాడుతున్నారు. సరైన సమయంలో ..దేశానికీ సరైన ప్రధాని ఉన్నారు అని కూడా చెపుతూ వస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కి పూర్తి స్థాయి మెజారిటీ దక్కని విషయం అందరికి తెలిసిందే. దీంతో ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్ కుమార్ కు చెందిన జెడీయూ, తెలుగు దేశం పార్టీలు ఎంతో కీలకంగా ఉన్నాయి. అయినా సరే గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ...ముఖ్యంగా మోడీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా నరేంద్ర మోడీ గురించి ఏపీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
నరేంద్ర మోడీ ని ఎప్పటి నుంచో అయన పేరులోని అక్షరాల ఆధారంగా నమో అని పిలుస్తారు. మీడియా లో సైతం నమో పద ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నారా లోకేష్ ఈ నమో కు కొత్త అర్ధం చెప్పారు. నమో అంటే నరేంద్ర మోడీ మాత్రమే కాదు...నాయుడు, మోడీ కలయిక అని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఢిల్లీ లో మీడియా తో మాట్లాడిన లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 14 , 15 తేదీల్లో వైజాగ్ లో జరగనున్న భాగస్వామ్య సదస్సు గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఇప్పుడు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటానికి ప్రధాన కారణం చంద్రబాబు తో పాటు రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఎకో సిస్టం, మంచి సంబంధాలు నెలకొల్పటమే అన్నారు.
పెట్టుబడుల సాధనకు వేగవంతమైన సౌకర్యాల కల్పన ఎంతో కీలకం అని చెప్పారు. భాగస్వామ్య సదస్సు ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అదే సమయంలో రాష్ట్రం నుంచి గతంలో వెళ్లిపోయిన ప్రముఖ కంపెనీ గురువారం నాడు కొత్త పెట్టుబడి ప్రకటన చేయనుంది అని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నమో కు నారా లోకేష్ కొత్త గా ఇచ్చిన నిర్వచనం దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం నమో అన్నది నరేంద్ర మోడీ పేరు అయితే ..ఇప్పుడు నారా లోకేష్ ప్రధాని ని వెనక్కి నెట్టి నాయుడు ..మోడీ జోడి అని ప్రకటించటం దుమారం రేపుతోంది.