వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు సజ్జల వ్యాఖ్యలు సంకేతాలా?!

Update: 2024-05-02 16:15 GMT

Full Viewఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ టెన్షన్ పడుతుందా?. తాజా పరిణామాలు చూస్తుంటే ఎవరికైనా ఈ అనుమానాలు రాక మానదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో నష్టం చేసే అవకాశం ఉంది అనే భయం వైసీపీ నేతలను వెంటాడుతుంది. అందుకే తాజాగా వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి కీలక నేతలు అందరూ దీనిపై పదే పదే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా తాజాగా ఈ అంశంపై స్పందించారు. అటు టీడీపీ, జన సేన లు ఈ చట్టం వల్ల ప్రజల భూముల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇంతకాలం ఈ విషయంపై పెద్దగా స్పందించని వైసీపీ ఇప్పుడు విషయం గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ...ఈ చట్టం భూ హక్కుదారులకు ఎంతో మేలు చేస్తుంది అని చెప్పటం కంటే కూడా...ఇది బీజేపీ తెచ్చింది...మేము అమలు చేస్తున్నాం అనే కొత్త పాట అందుకున్నారు. అయితే ఇక్కడ ఈ చట్టాన్ని బీజేపీ తెచ్చినా మరెవరు తెచ్చినా కూడా దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. చిరవరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది అమల్లోకి తేలేదు అని ఒక అధికారి వెల్లడించారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు ఆగమేఘాల మీద ఈ చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేయటం దుమారం రేపుతోంది. మరో వైపు దేశంలో..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భూమి తో ప్రజలకు ఎంతో అనుబంధం ఉంటుంది. అలాంటిది తమ భూమి ఒరిజినల్ పత్రాలు హక్కుదారుల వద్ద కాకుండా...ప్రభుత్వం వద్ద ఉంటాయి అంటే ఒప్పుకోవటానికి మానసికంగా ప్రజలు ఎవరూ సిద్ధంగా ఉండరు.

                                          నిజంగా చట్టం ఎంత పటిష్టంగా ఉన్నా తమ పత్రాలు తమ దగ్గర ఉండవు అన్న ఫీలింగే జనం అంగీకరించటం కష్టం. అయితే జగన్ సర్కారు ఇంత ఆగమేఘాల మీద దీన్ని అమలు చేయటానికి సిద్ధం కావటం వెనక వేరే కథ ఉంది అని అధికారులు చెపుతున్నారు. కేంద్రం..నీతి ఆయోగ్ చెప్పినట్లు చేసి రుణాల విషయంలో ...ఇతర అంశాల పరంగా వెసులుబాటు పొందటమే లక్ష్యంగా ఈ పని చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఇది రాజకీయంగా ఈ ఎన్నికల్లో వైసీపీ కి తీరని నష్టం చేసే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ మేనిఫెస్టో పై గురువారం నాడు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసిన వాళ్ళు వైసీపీ ఇంత ఫ్రస్ట్రేషన్ లోకి ఎందుకు వెళ్ళిపోయింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ను భూతు పత్రం, చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలను నిప్పుల గుండంలో వేసి తొక్కుతారు అంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు చూసిన వాళ్ళు అవాక్కు అవుతున్నారు. ఆ పార్టీ ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉందో ఈ మాటలు చూస్తే అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

                                చంద్రబాబు హామీల అమలు సాధ్యం కాదు...గతంలో అయన ఇలా ఇచ్చి మోసం చేసాడు అంటూ అటు జగన్ తో పాటు వైసీపీ నేతలు అందరూ చెపుతున్నారు. రాజకీయ విమర్శలు అన్ని పార్టీ లు చేసుకుంటాయి...కానీ సజ్జల ఏకంగా భూతు మేనిఫెస్టో, నిప్పుల గుండంలో వేసి తొక్కుతారు అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ లో ఉన్న టెన్షన్ ను తెలియచేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చిన ఆర్థికపరంగా భారీ భారం పడే హామీల కంటే టీడీపీ , జనసేన కూటమి హామీల విషయంలో కొంతలో కొంత ఉచిత ఇసుక, మహిళలకు ఫ్రీ బస్ ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే చర్చ వైసీపీ నేతల్లో కూడా సాగుతోంది. వైసీపీ మేనిఫెస్టో లో ఈ సారి పెద్దగా కొత్త మార్పులు ఏమీ లేకపోగా...వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటర్లను మాయ చేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఇచ్చిన హామీలను కూడా మేనిఫెస్టో లో పెట్టి ప్రజలకు ఇకపై డబల్ లాభం కలిపించనున్నట్లు కలరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవానికి జరిగేది మాత్రం అందుకు భిన్నం అనే చెప్పాలి. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏవి అయితే తమ గెలుపునకు కీలకం అని వైసీపీ భావిస్తూ వస్తుందో అవే ఇప్పుడు ఆ పార్టీ కి ప్రతికూలంగా మారినట్లు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మరి లబ్ధిదారులు వైసీపీ ని గట్టు ఎక్కిస్తారా లేదా అన్నది జూన్ 4 న కానీ తేలదు.

Tags:    

Similar News