ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికే టీడీపీ, బిజెపిలను పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా వీరిద్దరూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ఉపఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్‌పోసి తగలబెట్టారని.. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని కొడాలి నాని తెలిపారు. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదిలేదని తేల్చేశారు. ''అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి'' అని మంత్రి ప్రశ్నించారు. ''బీజేపీ అరాచకాల పార్టీ.. కులమతాలు రెచ్చగొట్టే పార్టీ. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావట్లేదంటే ఎందుకో ఆలోచించాలి. పెట్రోల్ ధరల ప్రభావం బీజేపీపై పడింది. బీజేపీ నేతలు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసినా జగన్‌ను ఏమీ చేయలేరు. ఇక్కడ మేకలు, నక్కలు ఏమీ లేవు.. పులివెందుల పులి జగన్. కేంద్రాన్ని అడగాల్సినవి రాష్ట్రాన్ని అడుగుతారా...?. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించేది లేదు'' అన్నారు. కేంద్రమే పెట్రోల్ రేట్లు తగ్గించాలని కొడాలినాని అన్నారు. కేంద్రం పెట్రోల్‌పై 40 రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించిందని, ఏదో ఘన కార్యం చేసినట్లు బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారని, రూ. 5 తగ్గించి ప్రజలకు ఏదో మేలు చేశామంటున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్ బంకులపై దాడులు చేసేందుకు చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టారని అన్నారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పెట్రోల్ పోసి తగులబెట్టారని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. నాడు పెట్రోల్, డీజిల్‌పై సర్‌చార్జి విధించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని అన్నారు. చంద్రబాబు, పవన్‌కు ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. స్టీల్‌ప్లాంట్‌పై మోదీకి పవన్ అల్టిమేటం ఇవ్వాలి.. సీఎం జగన్‌కు కాదు అని మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోవటానికి పవన్ కళ్యాణ్ కు సిగ్గుండాలన్నారు. చంద్రబాబును కూడా ప్రజలు పలు ఎన్నికల్లో పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.