సంపూర్ణ అధికారం ఎవరినైనా ఈజీ గా చెడగొడుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ కి 151 సీట్లు రావటంతో ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారో అందరూ చూశారు. ప్రజలు తనకు ఇన్ని సీట్లు ఇచ్చిన తర్వాత అంతా తన ఇష్ట ప్రకారం సాగాలి కానీ... ఈ రూల్స్..గీల్స్ అంతా ఏంది అన్నట్లు వ్యవహరించారు జగన్. అందుకే ఆయన మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా లెక్కచేయలేదు. తన పేరు చెపితే...తన బొమ్మ పెట్టుకుంటే...ఎవరైనా....ఎక్కడైనా అలా గెలిచిపోతారు అని బలంగా నమ్మారు...అదే చెప్పారు కూడా. కానీ మొన్నటి అంటే 2024 ఎన్నికల్లో ఏమైందో అందరూ చూశారు. జగన్ నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ కొంత మంది టీడీపీ కీలక నేతలు కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మేలు కోరి అధినేతకు ఏమైనా సూచనలు చేసినా కూడా వాటిని ఏ మాత్రం సానుకూలంగా తీసుకోకపోవటం అలా ఉంచి చెప్పిన వాళ్లపై ఫైర్ అవుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇది చూసిన వాళ్ళు అంతా సొంతంగా టీడీపీ నే 135 సీట్లు గెలవటం..మొత్తం కూటమికి కలుపుకుని 175 అసెంబ్లీ సీట్లలో 164 సీట్లు ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు పార్టీలో ఎంత పెద్ద నాయకులకు అయినా అపాయింట్ మెంట్ దొరకటం కూడా కష్టంగా మారినట్లు చెపుతున్నారు. ఈ నంబర్లు చూసుకునే కీలక నేతలు ఇది అంతా తమ ఇమేజ్ కారణంగా వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అని చెపుతున్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ తరహా లీడర్ ఒకరు పుట్టుకొచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రజల్లో ఆయనకు పట్టుమని పది ఓట్లు వచ్చే అవకాశం లేకపోయినా కూడా యువ నేతతో సదరు వ్యక్తికి ఉన్న సాన్నిహిత్యం ఆధారంగా ఈ హవా చెలాయిస్తున్నట్లు చెపుతున్నారు. ఆయన ఆఫీస్ లో ఉంటే ఆ ఫ్లోర్ కు ఎంత పెద్ద సీనియర్ నేతలకు కూడా ఎంట్రీ ఉండదు అని ...అక్కడ ఏమి రహస్య కార్యకలాపాలు జరుగుతాయో తెలియదు అని ఒక సీనియర్ నేత వాపోయారు. అందుకే కొంత మంది పార్టీ నాయకులు ఆయన్ను కిమ్ గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కిమ్ వ్యవహారం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పైకి కనిపించకపోయినా తెర వెనక కార్యకలాపాలు మొత్తం ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.