జనసేనలో పెరిగిన జోష్

Update: 2021-02-27 09:41 GMT

ఏపీలో మార్పుకు ఇదే సంకేతం

పంచాయతీ ఎన్నికల అనంతరం జనసేనలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. రాష్ట్రంలో మార్పునకు ఇదే సంకేతం అని ఆయన వ్యాఖ్యానించారు. 'పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నాలుగు దశల్లో 1209 సర్పంచ్, 1776 ఉప సర్పంచ్, 4456 వార్డుల్లో జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం చాలా సంతోషానిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. ఉభయగోదావరి జిల్లాల్లో 80 శాతం పంచాయతీలు, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 71 శాతం పంచాయతీయల్లో ద్వితీయస్థానంలో నిలిచాం. చాలా మంది అభ్యర్ధులు విజయం ముంగిట 10 నుంచి వంద ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

మొత్తం మీద 27 శాతం ఓటింగును జనసేన పొందింది. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం, కృష్ణా - గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్లను జనసేన కైవశం చేసుకుంది. ఈ విజయం చాలా తృప్తినిచ్చింది. నేను చెబుతున్న గణంకాలు చాలా కన్సర్వేటివ్ గా చెబుతున్న గణంకాలు. ఈ విజయానికి ముఖ్య కారకులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జనసైనికులు, కుల రాజకీయాలకు, అవినీతి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన ఆడపడుచులు, వీరమహిళల విజయం ఇది. డబ్బుతో రాజకీయం కాకుండా ఆశయాలతో ముందుకు వెళ్లాలనుకునే అభ్యుదయవాదుల విజయం ఇది.

ఒక్క రూపాయి కూడా పంచకుండా, దౌర్జన్యాలకు దిగకుండా ఎన్నికల బరిలో జనసైనికులు బలంగా నిలిచారు. వాళ్లపై దాడులు జరుగుతున్నా, అధికార మదంతో అధికార పక్షం వాళ్ళు తలలు పగలగొట్టినా... రక్తసిక్తం చేసినా, కుట్లు వేయించుకొని మరి ఎన్నికల్లో జనసైనికులు చాలా ధైర్యంగా నిలబడ్డారు. దానికి దమ్మాలపాడు గ్రామమే నిదర్శనం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేనకు దక్కిన ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు ఓ గొప్ప సంకేతం. సామాన్యులు అసామాన్య రీతిలో గెలవడం, ఎన్ని అవాంతరాలు కలిగించినా నిలబడిన వారికి, పోటాపోటీగా పోరాడి కొద్ది తేడాతో ఓటమిపాలైన వారికి, ఇంతటి పోరులో గెలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను.' అని ఓ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News