మరో వైపు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు..దీని కోసం ఏకంగా రెండు పార్టీల నేతలతో ఉమ్మడి కమిటీ కూడా వేసుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన పొత్తుపై ఏమైనా ప్రభావం పడుతుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతే కాదు...డిసెంబర్ మూడున వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అటు బీజేపీ కి..ఇటు జనసేన కు ఏ మాత్రం గౌరవ ప్రదమైన ఫలితాలు రాకపోయినా ఆ ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై కూడా పడటం ఖాయం అనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే తెలుగు దేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన తో పోలిస్తే తెలంగాణాలో టీడీపీ కే కొంత మంది నాయకులు, క్యాడర్ ఉన్నారు. అదే జనసేన విషయానికి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప పెద్దగా జనసేన కు గుర్తింపు ఉన్న నాయకులు, క్యాడర్ కూడా లేరు అనే చెప్పవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన ఎందుకు ఇంత సాహసం చేస్తోంది...ఇది అంతా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఏపీ ఎన్నికల నాటికీ ఈ పొత్తుల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.