వైసీపీ లో సజ్జల వ్యాఖ్యల దుమారం!

Update: 2025-09-13 13:59 GMT

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ మరో సారి రివర్స్ గేర్ వేసినట్లే కనిపిస్తోంది. శుక్రవారం నాడు విజయవాడ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీఎం జగన్ మౌత్ పీస్ గా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ మోహన్ రెడ్డి అమరావతి నుంచే పాలన సాగిస్తారు అని చెప్పారు. ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మరో సారి హాట్ టాపిక్ గా మారింది. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వైసీపీ నేతలు అంతా కూడా ఇదే మాట చెప్పారు. చంద్రబాబు కు అమరావతి లో ఇల్లు లేదు అని..కానీ తమ నేత ఇక్కడ ఇల్లు కట్టుకున్నందున రాజధానిని మార్చే అవకాశమే లేదు అంటూ మీడియా సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. కానీ సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అటు అమరావతి ఒక కొలిక్కి రాలేదు...మూడు రాజధానులు పట్టాలు ఎక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే రాజధాని అమరావతి ని మారుస్తాడు అంటూ 2019 ఎన్నికలకు ముందే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంతో పాటు అంతకు ముందు కూడా పలు మార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

                                            దీనికి కౌంటర్ గా జగన్ ఎన్నికలకు ముందు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో తనదైన శైలిలో విజయవాడ-గుంటురూ అంటూ రాజధాని ఈ ప్రాంతంలోనే ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాదు అసెంబ్లీ లో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. రెండవసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు రాజధాని అమరావతి లో వేల కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు అప్పగించి వచ్చే మూడేళ్ళలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వైజాగ్ వెళ్ళరు అని..ఇక్కడ నుంచే పాలన సాగిస్తారు అని చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది నిజంగా చెప్పిన మాటా..లేక ఎన్నికల ముందు చెప్పినట్లే మరో సారి రాజకీయంగా చేసిన ప్రకటన అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు కూటమి ప్రభుత్వం ఇప్పుడు దగ్గర దగ్గర ఏభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి నూతన భవనాలతో పాటు మౌలికసదుపాయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తే...మరో వైపు సజ్జల అసలు అమరావతి లో ఇప్పుడు కొత్తగా ఎలాంటి భవనాలు కట్టాల్సిన అవసరం లేదు అని చెపుతున్నారు.

                                       ఇప్పుడు ఉన్న భవనాలే సరిపోతాయి అని చెప్పుకొచ్చారు. మరో వైపు సజ్జల విజయవాడ- గుంటూర్ మధ్య అవసరం అయిన భవనాలు కట్టుకుంటే సరిపోతుంది కానీ ఇవి అవసరం లేదు అన్న తరహాలో మాట్లాడారు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాతో ...లేకపోతే మరో టర్మ్ లోనో వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా మొన్నటి లాగే జగన్ అప్పుడు కూడా ఇప్పుడు కట్టే కొత్త భావనాల్లోకి వచ్చే అవకాశం ఉండదు అని ఒక వైసీపీ నాయకుడు వెల్లడించారు. అధికారంలో ఉన్న సమయంలో రాజధానిని మార్చటమే కాదు...తన ఫ్యామిలీ ని కూడా వైజాగ్ కు షిఫ్ట్ చేస్తున్నట్లు జగన్ సీఎం గా ఉన్న సమయంలో పలు మార్లు బహిరంగ వేదికల్లోనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారం పోవటంతోటి పాత నినాదానికి గుడ్ బై చెప్పినట్లు అయింది. సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టం అయింది అన్న చర్చ సాగుతోంది. వైసీపీ లో సజ్జల వ్యాఖ్యలు కలకలం రేపాయి. అసలు ఇప్పుడు ఆ విషయం జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అన్నది ఎక్కువ మంది నాయకుల ప్రశ్న. సజ్జల రామకృష్ణా రెడ్డి రాజధాని కామెంట్స్ పై మంత్రి నారాయణతో పాటు అధికార టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News