జగన్ సర్కారు వరస పెట్టి వివాదాల్లో చిక్కుకుంటుంది. ఎన్నికల ఏడాది లో ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా ప్రత్యర్థి పార్టీలు వాటిని ఏ మాత్రం వదిలిపెట్టవు అనే విషయం తెలిసిందే. ఇప్పటికి వైజాగ్ రుషి కొండలో నిర్మిస్తున్న కట్టడాలు పర్యాటక శాఖ కోసమా..ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ కోసమా అన్న వివాదం సాగుతోంది. ఈ తరుణంలో విశాఖ మహానగర పాలిక సంస్థ సుమారు 40 లక్షల వ్యయంతో కొత్తగా కట్టిన అత్యాధునిక బస్సు షెల్టర్ ఒక వైపు ఒరిగిపోయింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక బస్సు షెల్టర్ సరిగా కట్టడం రాదుకాని...జగన్ సర్కారు మూడు రాజధానులు కడుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గట్టిగా కట్టిన వాటిని కూల్చేస్తారు...జగన్ సర్కార్ కడితే ఇలానే ఉంటుంది అంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ బస్సు షెల్టర్ విషయంలో , మరో వైపు టీటీడీ బోర్డు సభ్యల నియామకం విషయంలో కూడా వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా సరే అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ నిర్ణయాల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మాత్రం కొంత మంది వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే జగన్ తెలుగు దేశం హయాంలో చెన్నయ్ కి చెందిన శేఖర్ రెడ్డి కి టీటీడీ బోర్డు లో చోటు కలిపిస్తే డబ్బులు తీసుకుని పదవి ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. విమర్శలు గుప్పించారు. పవిత్రమైన టీటీడీ ని రాజకీయాలకు వాడుకుంటున్నారు అంటూ ఆరోపించారు. సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిపై అయితే తీవ్రమైన విమర్శలు చేశారో అదే శేఖర్ రెడ్డి కి టీటీడీ బోర్డు లో ప్రత్యేకంగా చోటు కల్పించారు. తాజాగా టీటీడీ బోర్డు నియామకం కూడా తీవ్ర విమర్శల పాలు అయింది. అరెస్టే అర్హత అన్న చందంగా ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్ట్ అయి జైల్లో ఉండి వచ్చిన శరత్ చంద్ర రెడ్డి కి, మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఎంసిఐ) మాజీ చీఫ్ కేతన్ దేశాయ్ కూడా అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. మొత్తం 24 మందితో కొత్త బోర్డు ను ప్రకటించారు. దేశ, విదేశాల్లోని కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే టీటీడీ లో లిక్కర్ స్కాములో అరెస్ట్ అయినా వారికి, ఎంసిఐ స్కాములో అరెస్ట్ అయినా వారికి పదవులు ఇవ్వడంపై దుమారం చెలరేగుతోంది. టీటీడీ బోర్డు నియమాలను ఎప్పటినుంచో రాజకీయాలు శాసిస్తున్నాఈ సారి మరీ స్కాంల్లో, అవినీతి ఆరోపణలపై అరెస్ట్ వారికి చోటు కల్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.