ఏపీ లో పవర్ ప్యాక్ ఫ్యామిలీ

Update: 2025-07-14 07:18 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో పవర్ (అధికారం) అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన తనయుడు నారా లోకేష్ దే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ అధికారంలో ఇతర భాగస్వాములు ఉన్నా కూడా వాళ్ళ పాత్ర పరిమితం అనే చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ అంతా మా ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అటు కాంట్రాక్టు లు అయినా...ఇటు పవర్ ప్రాజెక్ట్ లు అయినా వాళ్లకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కళ్ళ ముందు ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా కూడా ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు అలా పెట్టించి మరీ ఇలా వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ లు కేటాయిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ రంగాన్ని చంద్రబాబు సర్కార్ ఒక ఫ్యామిలీ కి పూర్తిగా ధారాదత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మామ కంపెనీ కి నాలుగు భారీ విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించిన సర్కారు...ఇప్పుడు అల్లుడు కంపెనీ కి కూడా మరో విద్యుత్ ప్రాజెక్ట్ కేటాయించటానికి సిద్ధం అయింది. ఎవరు ఈ మామ అల్లుళ్ళు అంటారా?. ఆయనే నవయుగా విశ్వేశ్వర్ రావు...ఆయన అల్లుడు రఘు రాయల. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కారు ఇటీవల వరకు నవయుగా ఇంజనీరింగ్..చింతా గ్రీన్ ఎనర్జీ పేరు మీద కలుపుకుని 5360 మెగావాట్ల సామర్ధ్యం తో కూడిన పవర్ ప్రాజెక్ట్ లను వివిధ జిల్లాల్లో కేటాయించింది.

                                                                   ఇందులో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లతో పాటు సోలార్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. చింతా గ్రీన్ ఎనర్జీ కంపెనీ విషయంలో అయితే అలా కంపెనీ పెట్టారో లేదో ఇలా ప్రాజెక్ట్ లు కేటాయించుకుంటూ పోయారు. ఇప్పుడు ఇవి చాలవు అన్నట్లు నవయుగా విశ్వేశ్వర రావు అల్లుడు రాయల రఘు కు చెందిన ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ కు కూడా మరో 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయించటానికి ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దగ్గర జరిగిన ఎస్ఐపీసీ సమావేశంలో ఓకే చేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. అంటే దీన్ని కూడా కలుపుకుంటే మామా..అల్లుళ్లకు చెందిన కంపెనీలకు మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఏకంగా 6160 మెగావాట్ల సామర్ధ్యం తో కూడిన పవర్ ప్రాజెక్ట్ లు కేటాయించినట్లు అవుతుంది. ఇది ఇంతటితో అయిపొయింది అనుకుంటే పొరపడినట్లే. రాజధాని అమరావతి లో కూడా ఇప్పటికే ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ కు దగ్గర దగ్గర 4377 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది పనులు కేటాయించారు.

                                                  ఇవి సరిపోవు అన్న చందంగా ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్ కేటాయించటానికి కూడా సిద్ధం అయ్యారు. ఇది అంతా కూడా ఒక ఎజెండా ప్రకారమే సాగుతోంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని మైనింగ్ వ్యవహారాలకు కూడా పలు కంపెనీలను బినామీగా ఉపయోగిస్తున్నారు అని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఏపీలో ఇన్ని వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ లు దక్కించుకున్న చింతా గ్రీన్ ఎనర్జీ కి ఇప్పటి వరకు వెబ్ సైట్ కూడా రెడీ కాలేదు. గూగుల్ చేస్తే లాంచింగ్ సూన్ అని కనిపిస్తోంది. అంటే ముందు వేల కోట్ల రూపాయల విలువైన..వేల మెగా వాట్ల ప్రాజెక్ట్ లు దక్కించుకుని ఈ పని చిన్నగా చేస్తారు అన్న మాట. అంతే మరి వడ్డించేవాడు మనవాడు అయితే వెబ్ సైట్ ఏంటి...కంపెనీ తర్వాత రిజిస్టర్ చేస్తామన్నా ముందు అయితే ప్రాజెక్ట్ లు ఇచ్చేలా ఉన్నారు.

Tags:    

Similar News