ఏపీలో కాంగ్రెస్ కొంచెం పెరిగినా వైసీపీ ఇక అంతే!

Update: 2023-12-27 16:03 GMT

Full Viewదక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. వరసగా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం కాంగ్రెస్ కు సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు అదే జోష్ తో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ని పూర్తి స్థాయిలో గాడిన పెట్టడానికి హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గా మాణిక్యం ఠాకూర్ ని నియమించారు. బుధవారం నాడు ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు కీలక నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొని ఏపీ నేతలకు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు అవసరమైన మార్గనిర్దేశం చేశారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతాలు సృష్టిస్తుంది అని ఎవరూ చెప్పరు. అంతే కాదు సీట్లు గెలుచుకుంటుంది అనే ఆశలు కూడా పెద్దగా ఎవరికీ లేవు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం అవగతమే. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే హోరా హోరీగా సాగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్నా... కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏ మాత్రం పెరిగినా అది ఖచ్చితంగా వైసీపీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొత్త టెన్షన్ గా మారింది అని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎంత మేర పెరిగినా అది తొంబై శాతం పైగా వైసీపీ నుంచి వెళ్ళేదే తప్ప మరొకటి కాదు అనే విషయం అందరికి తెలిసిందే.

                                               ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులే కాకుండా ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా పూర్తిగా వైసీపీ వైపు వెళ్ళటం వల్లే జగన్ రాజకీయంగా నిలదొక్కుకోవడం తో పాటు గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఇదే అంశంపై ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కూడా తగ్గుతూ వస్తోంది. అంతే కాదు..విభజన తర్వాత తొలి సారి సీఎం అయిన చంద్రబాబు తో పాటు రెండవ సారి సీఎం అయిన జగన్ కూడా ప్రత్యేక హోదా తో పాటు కేంద్రం నుంచి విభజన హామీలు సాధించటంలో విఫలం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఆంధ్ర ప్రదేశ్ కు హామీ ఇచ్చినట్లు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని చెపుతూ వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు మార్లు బహిరంగంగానే ఈ విషయం ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ని మరింత కలవర పెట్టే అంశం ఏమిటి అంటే వై ఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారు అనే ప్రచారం. ఇది ఏ మాత్రం వాస్తవరూపం దాల్చినా వైసీపీకి, జగన్ కు ఇరకాట పరిస్థితి తప్పదు అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ఈ సారి కాంగ్రెస్ తరపున ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం తప్పదనే అంచనాలు వైసీపీ నేతల్లో ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు అనే అభిప్రాయం ఉంది. ఈ రాజకీయ అంశాలకు తోడు వివిధ వర్గాల ప్రజల్లో జగన్ సర్కారుపై వ్యతిరేకత కూడా భారీగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే అధికార వైసీపీ కి రాబోయేది గడ్డుకాలమే అని చెప్పకతప్పదు.

Tags:    

Similar News