ఆ కంపెనీలతో రాష్ట్రానికి వచ్చేది ఎంత..పోయేది ఎంత!

Update: 2025-11-17 06:49 GMT

ఏ రాష్ట్రం అయినా పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించి ...రాష్ట్ర అభివృద్ధికి...ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. నిజంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని అదే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైజాగ్ లో పెద్ద ఎత్తున భాగస్వామ్య సదస్సు నిర్వహించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా పన్నెండు కీలక రంగాలకు చెందిన 613 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని ఏకంగా 13 . 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నంబర్లు చూడటానికి బాగానే ఉన్నా కూడా గతంలో జరిగిన పలు భాగస్వామ్య సదస్సులు..చేసుకున్న ఒప్పందాలు...ప్రాజెక్ట్ ల అమలు తీరు చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తం కావటం సహజమే. అయితే ఈ ఒప్పందాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వచ్చిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఇందులో చేర్చారు. ఈ విషయం పక్కన పెట్టినా కూడా ప్రభుత్వం చెపుతున్నట్లు కొత్తగా వచ్చిన 13 . 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎన్ని గ్రౌండ్ అవుతాయి...ఎన్ని పూర్తి అవుతాయి అన్నదే అత్యంత కీలక కాబోతుంది.

                                   చంద్రబాబు ఈ టర్మ్ ముగిసే లోగా ఇందులో కనీసం సగం అన్నా పూర్తి అయి ఆ ఫలితాలు ప్రజలకు కనిపిస్తే తప్ప..లేకపోతే దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది అన్నది అధికారులు చెపుతున్న మాట. ఎందుకంటే ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..మరో వైపు మంత్రి నారా లోకేష్ లు తమ వల్లే...తమ బ్రాండ్ వల్లే రాష్ట్రానికి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. భాగస్వామ్య సదస్సు కోసం చాలా మంది మంత్రులను విదేశాల్లో తిప్పినా కూడా క్రెడిట్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ చంద్రబాబు, నారా లోకేష్ లు మాత్రమే ఇది క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అత్యంత కీలక విషయం ఏమిటి అంటే ఈ పదమూడున్నర లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి సాధనకు ప్రభుత్వపరంగా ఇచ్చే భూమి కాకుండా ఎన్ని లక్షల కోట్ల రూపాయల మేర ఆయా సంస్థలకు ఆర్థిక రాయితీలు ఇవ్వబోతున్నారు...ఆ వివరాలు అన్ని ప్రభుత్వం బయటపెడుతుందా?. దారుణం ఏంటి అంటే కొన్ని కంపెనీల విషయంలో ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి మొత్తంలో ఏకంగా 65 నుంచి 70 శాతం వరకూ రాయితీలు..ప్రోత్సహకాల రూపంలో కేటాయించబోతున్నారు. కొన్నిటి విషయంలో చూస్తే ఆయా యూనిట్ లు ఆంధ్ర ప్రదేశ్ కు రావటం వల్ల వచ్చే లాభం కంటే ఆయా ప్రైవేట్ సంస్థలకు కలిగే లాభమే చాలా ఎక్కువగా ఉండబోతుంది.

                                             కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ సహకారంపై ఆధారపడి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెచ్చుకుంటే దాని వల్ల రాష్ట్రానికి లాభం ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న బిపీ సిఎల్ రిఫైనరీ వల్ల కూడా రాష్టానికి పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే కంపెనీ పెట్టుబడి 96,862 కోట్ల రూపాయలు అయితే...75 శాతం అంటే ఏకంగా ప్రభుత్వమే 72 ,646 కోట్ల రూపాయల మేర వివిధ రకాల ప్రోత్సహకాలు..రాయితీల రూపం లో ఆ సంస్థకు చెల్లించనుంది. ఇదే కాదు వైజాగ్ సమీపంలోని అనకాపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా కు ఇచ్చే రాయితీలు కూడా ఇంచు మించు ఇదే మోడల్ లో ఉన్నాయి.  టైలర్ మేడ్ కండీషన్స్ పేరుతో ఒక్కో కంపెనీకి ఒక్కో రకంగా రాయితీలు ఇస్తూ పోతున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ..ఇటు మంత్రి నారా లోకేష్ కానీ ఎక్కువ శాతం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప..రాష్ట్రం కోణంలో ఆలోచించటం లేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

                              దీనికి ఉద్యోగ అవకాశాల కల్పన అనే ముసుగు తొడిగి ఈ పేరుతో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు...కార్పొరేట్ కంపెనీలు రాష్ట్ర వనరులపై దృష్టి పెట్టాయని చెపుతున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఆయా కంపెనీల రాక వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఎంతో...రాష్ట్రం నుంచి ఆయా కంపెనీలు పొందే లాభం ఎంతో చెపితే కానీ ప్రజలకు వాస్తవాలు అర్ధం కావు. అప్పటి వరకు వీళ్ళు పరిశ్రమలు..పెట్టుబడులు...ఉపాధి అవకాశాల కల్పన పేరుతో ఈ ప్రమాదకర ఆట ఆడుతూనే ఉంటారు అని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఐటి అభివృద్ధి పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ప్రభుత్వ వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారు చౌకగా కట్టబెడుతూ అంతా తమ వల్లే వచ్చింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Full View

Tags:    

Similar News