2024 కంటే ముందే ఎన్నికలు..పవన్ కళ్యాణ్

Update: 2020-11-18 14:36 GMT

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 కంటే ముందే మనకు ఎన్నికలు రావొచ్చన్నారు. ఆ దిశగా జనసేన సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. 'క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ ఇవాళ ముందుకు వెళ్లడానికి ఎంతలా ఇబ్బందిపడుతుందో మనం చూస్తున్నాం. ఒక్క జనసైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కాలర్ ఎత్తి నిలబడుతున్నారు. అలాంటి వారిని క్రీయాశీలక సభ్యులుగా తీసుకోండి. అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యకర్తలను గాలికొదిలేస్తారు. జనసేన మాత్రం అలా ఎన్నటికి చేయదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది... సమస్య ఉన్నా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా స్పందించేది జనసేన పార్టీయే.

భవిష్యత్తులో అధికారం అందుకోవాలి అంటే క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకం. ప్రతి క్రియాశీలక సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేసేలా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పార్టీకి అండగా నిలబడే వ్యక్తిత్వం ఉండాలని సూచించారు. పార్టీకి ఉండే జనబలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో గత ఎన్నికల్లో విఫలమయ్యాం... మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. "ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రతి సమస్యపై నేనే మాట్లాడాలి... ప్రతి ఊరికి నేనే రావాలని ప్రజల్లో ఉంటుంది. అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లి సమస్యలను ఎత్తిచూపాను కనుకే ప్రతి సమస్యపై స్పందించాలని ప్రజలు కోరుకుంటారు.' అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News