రాజధాని తరలింపు అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. నాలుగు నెలల్లో విశాఖకు పరిపాలనా రాజధాని తరలివెళుతుందని స్పష్టం చేశారు. ఒక రోజు అటో ఇటో..తరలింపు మాత్రం పక్కా అన్నారు. అప్పటికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులు అన్నీతొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఓ ఫ్యాక్షనిస్టుల వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడులు జరిగిన అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే ఎన్నికల అంశం తెరపైకి రావటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
ఉద్యోగుల తొలగింపు విషయంలో నిమ్మగడ్డ వైఖరి ఏ మాత్రం సమర్ధనీయం కాదన్నారు. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఈ కుట్రలకు నాయకత్వం వహిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే కొందరు రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నిమ్మగడ్డకు కోర్టు అక్షింతలు వేసిందని అన్నారు.