ఆ ఐఏఎస్ అధికారి అవినీతి చరిత్ర సహచర అధికారులతో పాటు రాజకీయ నాయకులకూ కూడా బాగా తెలిసిన వ్యవహారమే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రులకు..ఆర్థిక మంత్రులకు షాక్ ఇచ్చే నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. నెల్లూరు లో ఏర్పాటు అయిన ఒక కంపెనీ అప్పటి ప్రభుత్వం దగ్గర దగ్గర పది కోట్ల రూపాయల వరకు వివిధ ఇన్సెంటివ్ ల కింద నిధులు మంజూరు చేసింది. వాస్తవానికి అప్పటిలో నిధుల కట కట ఉండటంతో ఆర్థిక మంత్రితో మాట్లాడి మరీ సీఎం ఈ కంపెనీకి నిధులు కేటాయించే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఆ సంస్థ అప్పటిలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిపించింది. కానీ ఆ ఐఏఎస్ మాత్రం రాయితీలు పొందే కంపెనీ తనకు ముడుపులు ఇవ్వలేదు అనే కారణంతో ఆ బడ్జెట్ రిలీజ్ చేయలేదు. తర్వాత విషయం సీఎం దగ్గరకు వెళ్ళటం ఆ ఐఏఎస్ దగ్గర నుంచి సబ్జెక్టు తీసేశారు. ఇలాంటి ఘటనలు ఎన్నో. ఆ ఐఏఎస్ ఎక్కడ ఉన్నా...ఏ హోదా లో ఉన్నా కూడా అవినీతి అన్నది కామన్ పాయింట్ అనే చెప్పాలి.
వైసీపీ హయాంలో ఆ ఐఏఎస్ ఒక కీలక శాఖలో హవా చెలాయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆ ఐఏఎస్ అధికారి తన కీలక శాఖ పరిధిలో ఉండే ఒక విభాగం నుంచి పని చేసి పెడతామని వైజాగ్ కు చెందిన వైసీపీ నాయకుడి నుంచి ఏకంగా ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ నాయకుడు ఐదు కోట్ల రూపాయలు పోయినా సరే పని అయితే చాలు అనుకున్నారు. కానీ పని కాలేదు...ఆ ఐఏఎస్ మాత్రం తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి ఆ నాయకుడికి ఇవ్వలేదు. విషయం చివరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లినా కూడా సొంత పార్టీ నాయకుడికి ఆ ఐఏఎస్ నుంచి ఐదు కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇప్పించలేకపోయారు అని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా ఆ ఐఏఎస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశగా మారిన తరుణంలో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.