చూసి చదివే సీఎం గా జగన్

Update: 2024-04-29 07:49 GMT

ఫస్ట్ క్లాస్ స్టూడెంట్... ప్రశ్నలకు సమాధానాలు ఉండవు

Full Viewఆంధ్ర ప్రదేశ్ లో గత కొంత కాలంగా వినిపిస్తున్న నినాదం సింహం సింగల్ గానే వస్తుంది. అధికార వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా కొన్ని బహిరంగ సభల్లో ఇదే వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ లు కూటమి కట్టి ఎన్నికల్లో పోటీచేస్తుండంతోనే వైసీపీ ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. కానీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తే మాత్రం సింహం స్పీచ్ లే ఇస్తుంది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు అన్నట్లు ఉంది పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడు అయినా తన స్పీచ్ కోసం కొన్ని పాయింట్స్ రాసుకోవటం సహజం. కానీ జగన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం అనే చెప్పాలి. గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఏ బహిరంగ సభలో చూసినా ఆయన చేసే పని చూసి చదవటమే. పోనీ ప్రతి సమావేశంలో ఆయన ప్రసంగం ఏమైనా మారుతుందా అంటే....ఒకటి రెండు పాయింట్స్ తప్ప పెద్దగా మార్పులు ఏమి ఉండవు. అయినా సరే స్పీచ్ ఇవ్వాలంటే జగన్ ముందు ప్రసంగ కాపీ ఉండాల్సిందే.

                                                             ఆదివారం నాడు జగన్ మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రతి సమావేశంలోనూ ఆయన స్పీచ్ కోసం జగన్ వాహనంపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని పైన ఉన్న ఫొటోలో చూడొచ్చు. ఇక్కడ మరో కీలక విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. గత ఐదేళ్ల కాలంలో జగన్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పూర్తి స్థాయి మీడియా సమావేశం నిర్వహించింది లేదు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మాత్రం మీడియా సమావేశం పెట్టారు...తర్వాత కూడా మరో సారి పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన చెప్పేది చెప్పి వెళ్ళిపోవటం తప్ప ...మీడియా నుంచి ప్రశ్నలను తీసుకున్నది లేదు. మరి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కు మీడియా ప్రశ్నలు అంటే ఉలికిపాటు ఎందుకు. సింహంగా ప్రోజెక్ట్ చేసుకునే జగన్ ఐదేళ్లలో ఒక్కసారి కూడా పూర్తిస్థాయి మీడియా సమావేశం పెట్టలేకపోవటం ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుంది?.

                                                             ఎంత పెద్ద విషయం అయినా..సీరియస్ అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా కూడా...జగన్ స్పందించాలంటే ఏదైనా బహిరంగ సభ జరగాల్సిందే. అక్కడ మాత్రమే ఎంత లేటు అయినా తాను స్పందించాలి అనుకున్న అంశాలపై స్పందిస్తారు. అది మీడియా అయినా...మరెవరు అయినా వాళ్ల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పేది ఏంది అన్నట్లు జగన్ వ్యవహరిస్తారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జగన్ ను దగ్గర నుంచి చూసినా ఐఏఎస్ లు కూడా ఆయన చెప్పేది వినాల్సిందే తప్ప...జగన్ ఎలాంటి సలహాలు, సూచనలకు కూడా ఛాన్స్ ఇవ్వరు అని చెపుతున్నారు. ఒక వైపు సింహం అనే కలరింగ్ ..మరో వైపు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటూ చూసి చదవటం, వేదిక ఏదైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవటం, ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవటం విపక్షాలకు జగన్ అస్త్రాలు ఇచ్చినట్లు అయింది అనే చెప్పాలి.

Tags:    

Similar News