దుమారం రేపుతున్న దీపక్ రెడ్డి కామెంట్స్ !

Update: 2025-12-06 07:41 GMT

దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ఇండిగో ఎయిర్ లైన్స్ సృష్టించిన సంక్షోభమే. గత కొన్ని రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు వేల సంఖ్యలో రద్దు అయి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ప్రయాణికులు సహనం కోల్పోయి ఇండిగో సిబ్బందిపై దాడులకు కూడా యత్నిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. మరో వైపు ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది అనే అంశంపై ఎవరూ స్పష్టమైన ప్రకటన ఎవరూ చేయలేకపుతున్నారు. డిసెంబర్ నెలలో సహజంగానే ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. దీనికి కారణాలు ఎన్నో. సంవత్సరాంతం కావటం...క్రిస్మస్ సెలవులు ఇలా రకరకాల కారణాలతో ఎక్కువ మంది డిసెంబర్ నెలలో ప్రయాణాలు పెట్టుకుంటారు. ఉద్యోగులు అయితే మిగిలిన తమ సెలవులను వాడుకునేందుకు కూడా ఇదే నెలలో ప్లాన్ చేసుకుంటారు.

                                           అసలు ఇండిగో సంక్షోభానికి ఆంధ్ర ప్రదేశ్ ఐటి, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కు ఏమిటి సంబంధం?. ఇండిగో క్రైసిస్ పై రిపబ్లిక్ టీవీ లో ఆ ఛానెల్ అధినేత, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి డిబేట్ నిర్వహించారు. ఇందులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధి కల్పన, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా ఉన్న దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ డిబేట్ లో కేంద్ర ప్రభుత్వ తీరును అర్నాబ్ గోస్వామి తీవ్రంగా తప్పుపడుతూ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ...ఇండిగో ఎయిర్ లైన్స్ చేసిన బ్లాక్ మెయిల్ కు ప్రభుత్వం లొంగిపోయినట్లు ఉంది అని ఆరోపించారు. అందుకే రెండేళ్ల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్ డీటిఎల్) లో మళ్ళీ మినహాయింపులు ఇచ్చారు అని ఆరోపించారు. ఇదే అంశంపై అర్నాబ్ టీడీపీ నుంచి చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డి స్పందన కోరగా ఆయన ఈ అంశంపై స్పందిస్తూ తమ మంత్రి నారా లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అని ..ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది అన్నారు.

                                                                దీనిపై అర్నాబ్ స్పందిస్తూ మీ మంత్రి నారా లోకేష్ పౌర విమానయాన శాఖ మంత్రి కాదు అని...ఏ హోదా తో ఆయన పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. అదే సమయంలో ఒక రాష్ట్ర మంత్రి దేశ వ్యాప్తంగా నెలకొన్న సమస్యను ఎలా మానిటర్ చేస్తారు అన్నారు. ఏ హోదా తో నారా లోకేష్ దేశ పౌర విమానయాన శాఖ పరిస్థితిని మానిటర్ చేస్తారు అంటూ పలు మార్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దీపక్ రెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయం మానిటర్ చేస్తుంది అని...తర్వాత పౌర విమానాల శాఖ ఎమర్జెన్సీ వార్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని మదింపు చేస్తుంది అని చెప్పారు. తమ పార్టీ తరపున నారా లోకేష్ కూడా పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు..పరిస్థితిని చక్కదిద్దటానికి అని దీపక్ రెడ్డి చెప్పగా...ఇందులో అసలు మీ పార్టీ ఎలా భాగం అవుతుంది అన్నారు.

                                                                 దీనిపై దీపక్ రెడ్డి స్పందిస్తూ ఇది పార్టీ..రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు అని...ఇది ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశం అన్నారు. ఇది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీనా లేక టీడీపీ మినిస్ట్రీనా అని అర్నాబ్ మళ్ళీ ప్రశ్నించగా...వార్ రూమ్ ఏర్పాటు చేసి..ఆయన అందులో కూర్చుని మానిటర్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇండిగో ఒక ప్రైవేట్ కంపెనీ అని..తన పద్దతుల ప్రకారం అది వ్యాపారం చేసుకుంటూ పోతుంది అని..ఈ పరిస్థితి రావటానికి గల కారణాలపై ఒక కమిటీ వేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాము ఏమి చేస్తాం అన్నట్లు దీపక్ రెడ్డి మాట్లాడగా ప్రభుత్వంలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు అన్నారు. రిపబ్లిక్ టీవీ డిబేట్ లో పాల్గొన్న దీపక్ రెడ్డి వీడియో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.

                                                     దీపక్ రెడ్డి తమ నేత నారా లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేయగా...అది బెడిసి కొత్త దేశ వ్యాప్తంగా పరువు పోగుట్టుకొన్నట్లు అయింది అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా సాగుతోంది. ఇందులో ఎంత సేపు నారా లోకేష్ గురించి మాట్లాడటం తప్ప...కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు పరువు తీసేలా ఆయన వ్యవహరించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో రకంగా చెప్పాలంటే నేరుగా అటు టీడీపీకి , ఇటు మంత్రి నారా లోకేష్ కు ఏ మాత్రం సంబంధము లేని అంశాన్ని తీసుకొచ్చి పార్టీకి తగిలించినట్లు అయింది అని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News