ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తమకు అధికారం ఇచ్చింది నచ్చిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చుకోవటం...నచ్చిన కంపెనీలకు విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించటం కోసమే అన్నట్లు వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టు లన్నీ ఎంపిక చేసిన కంపెనీలకే...పవర్ ప్రాజెక్ట్ లు కూడా ఎంపిక చేసిన సంస్థలకే. దీని వెనక లెక్కలు చాలానే ఉన్నాయనే విషయం ప్రభుత్వంలోని ఏ అధికారిని అడిగినా చెపుతారు అనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున పవర్ డీల్స్, కాంట్రాక్టు డీల్స్ జరుగుతుంటే ఈ వ్యవహారాలు అన్ని కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో భాగస్వామి బీజేపీ నేతలకు తెలియకుండా జరిగే అవకాశం ఉండదు అనే చర్చ కూడా సాగుతోంది. కూటమిలో ఉన్నట్లే అందరూ కలిసే ఇవి అన్నీ చేస్తున్నారు అని ఒకే ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించటం విశేషం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ భాగస్వామిగా ఉంది అనే ధీమాతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ వ్యవహరించని రీతిలో చేస్తున్నారు అనే చర్చ కూడా ఐఏఎస్ వర్గాల్లో ఉంది.
ఈ విషయం కాసేపు పక్కన పెడితే ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒక కంపెనీ పెట్టాలంటే ఎన్నో లెక్కలు వేసుకుంటారు. ఆ కంపెనీ పెట్టబోయే వాళ్లకు ఆయా పరిశ్రమల్లో ఉండే లాభ, నష్టాలు కూడా పక్కాగా తెలిసి ఉంటాయి. ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్న వాళ్లకు అయితే ఈ విషయాలు బాగా తెలుస్తాయి. కానీ నవయుగా గ్రూప్ ప్రమోటర్ల తీరు విచిత్రం గా ఉంది. తొలుత నవయుగా గ్రూప్ ప్రమోటర్ అయినా చింతా విశ్వేశ్వరావు కు చెందిన చింతా గ్రీన్ ఎనర్జీ కడప జిల్లా కొండాపురం మండలంలోని కొప్పోలు దగ్గర 360 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్ పీ)కి అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయింది 2025 జూన్ 30 న. ఇది జరిగిన నెల రోజులు కూడా పూర్తి కాకుండానే తూచ్ ..తాము 360 మెగావాట్ల కాదు...అక్కడే 2400 మెగావాట్ల సామర్ధ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెడతామని లేఖ రాయటం...ఆ వెంటనే ఈ ప్రతిపాదన అటు ఎస్ ఐ పీబి, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందటం కూడా చకచకా జరిగిపోయాయి.
అసలు కంపెనీ ముందు 360 మెగావాట్ల అని చెప్పటం ఏంటి..అంతా ఒకే అయినా తర్వాత మళ్ళీ దీన్ని ఏకంగా 2400 మెగావాట్లకు పెంచటం ఏంటో అర్ధం కావటంలేదు అని విద్యుత్ శాఖ వర్గాలు కూడా నివ్వెరపోతున్నాయి. ఇది చూసి ఇది ప్రభుత్వమా.. లేక పిల్లల ఆటా ఏంటో అర్ధం కావటం లేదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. గండికోట రిజర్వాయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకోనున్నారు. తొలుత ఈ కంపెనీ 360 మెగావాట్లు అన్నప్పుడు కేటాయించిన నీళ్లు 2 .79 మిలియన్ క్యూబిక్ మీటర్ (ఎంసిఎం) అయితే ...ఇప్పుడు ఈ సామర్ధ్యాన్ని ఏకంగా 38 మిలియన్ క్యూబిక్ మీటర్ లకు పెంచారు. ఇదే తరహాలో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుజ్జిలి వద్ద ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సామర్ధ్యాన్ని కూడా తొలుత ఇచ్చిన 1500 మెగావాట్ల నుంచి 2400 మెగావాట్లకు పెంచుతూ చంద్రబాబు సారథ్యంలోని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ కంపెనీకి తొలుత 1400 మెగావాట్ల ప్రాజెక్ట్ కేటాయిస్తూ జీఓ ఇచ్చింది 2025 ఫిబ్రవరి ఏడున. చింతా గ్రీన్ ఎనర్జీ కి కడపలో తొలుత ప్రాజెక్ట్ ఇచ్చింది 2025 జూన్ 30 న.
అయినా సరే ఈ రెండు కంపెనీలు కూడా ఒకే రోజు అంటే అంటే 2025 జులై 22 న తమ యూనిట్ల సామర్ధ్యాన్ని పెంచుతామని ప్రభుత్వానికి లేఖలు రాయటం...ఆ వెంటనే వాటికి అటు సీఎం సారథ్యం వహించే ఎస్ఐపీబి, ఆ తర్వాత క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిపోయాయి. అంటే ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగినట్లు కనిపిస్తోంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ పెంపు లేకముందు మొత్తం నవయుగా విశ్వేశ్వర రావు ఫ్యామిలీ కంపెనీలకు ఆంధ్ర ప్రదేశ్ లో 6160 మెగావాట్ల సామర్థ్యం తో కూడిన వివిధ విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించారు. తాజాగా సామర్థ్యం పెంపుతో ఇప్పుడు ఈ మొత్తం ఏకంగా 9100 మెగావాట్ల సామర్ధ్యానికి చేరింది. దీంతో ఒక్క ఫ్యామిలీ కి చెందిన కంపెనీ లకు ఇంత భారీ మొత్తంలో పవర్ ప్రాజెక్ట్ లు కేటాయించటం చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.