ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే జగన్ హయాంలో వచ్చిన స్కీం లు రావటం లేదనే. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు తాజాగా ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత కీలకమైన తల్లికి వందనం స్కీం ప్రారంభించటం కీలక పరిణామంగానే చెప్పుకోవచ్చు. జగన్ హయాంలో కుటుంబంలో ఒక్కరికే ఇవ్వగా..ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా ఇది టీడీపీ తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలకు పెద్ద విజయంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ స్కీం పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ముఖ్యంగా లబ్ధిదారుల్లో. దీనికి తోడు ఇప్పుడు ఏకంగా 67 లక్షల మందికి తల్లికి వందనం స్కీం వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అందరి ఖాతాల్లో డబ్బులు పడటం కొంత జాప్యం అవ్వోచ్చేమో కానీ...పడటం మాత్రం పక్కా అన్న భోరోసా అయితే ప్రభుత్వం కలిపిస్తోంది. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 వందల రూపాయలు అమలు చేయటం సంగతి ఏమో కానీ..తల్లికి వందనం తో పాటు రైతులకు ప్రతి ఏటా కేంద్ర సాయంతో కలుపుకుని ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి ఆగస్ట్ 15 ను ముహూర్తంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నికల హామీల అమలు విషయంలో చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డు లేదు. కానీ ఈ సారి మాత్రం కీలక హామీల విషయంలో అడుగు ముందుకు వేస్తూ జగన్ హయాంలో ఉన్న రహదారుల సమస్య తో పాటు మద్యం పంచాయతీ..ఉద్యోగులకు జీతాలు వంటి సమస్యలు లేకుండా చేయటంలో విజయవంతం అయ్యారు. ఇవి అన్ని కూడా రాజకీయంగా వైసీపీ కి..ముఖ్యంగా జగన్ ను చిక్కుల్లో పడేసేవే అని చెప్పొచ్చు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేయలేరు అని అటు జగన్ తో పాటు వైసీపీ నాయకులు భావించారు.
అప్పులు తెచ్చారా...లేక ఎలా సర్దుబాటు చేశారా అన్న విషయం పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ స్కీం ను పట్టాలు ఎక్కించారు. మరో వైపు మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కూడా జగన్ వైఖరిలో పెద్దగా మార్పు లేదు అనే విమర్శలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అమరావతి పై అనవసర వివాదాలు కొని తెచ్చుకోవటం...నేరస్థులుగా ముద్రపడిన వాళ్ళను పరామర్శించేందుకు వెళ్ళటం వంటి చర్యల ద్వారా జగన్ రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడుతున్నారు అనే చర్చ వైసీపీ లోనే సాగుతోంది. ఇదే విషయాన్ని అధికార పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తోంది. చంద్రబాబు ఎన్ని ఎక్కువ హామీలు అమలు చేస్తే రాజకీయంగా జగన్ కు అంత మైనస్ ఖాయం అని వైసీపీ నేతలకు కూడా అభిప్రాయపడుతున్నారు.
జగన్ చెపుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఉన్న మోడల్ ఏ మాత్రం వర్క్ అవుట్ కాదు అని...అయితే ఇందుకు భిన్నంగా వెళ్ళటానికి జగన్ అంగీకరిస్తారా అంటే అది కూడా ఏ మాత్రం జరగదు అని చెపుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఇంతకాలం రాష్ట్రంలో తాను అమలు చేసినంతగా ఎవరూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు అని జగన్ చెప్పుకునే వారు. పెన్షన్ దగ్గర నుంచి మొదలుపెడితే తల్లికి వందనం వంటి స్కీం ల విషయంలో జగన్ హయం కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ ఇస్తున్నారు అనేది స్పష్టం.