ఏపీ సర్కారు మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పీ. నారాయణ విషయంలో ఏ మాత్రం రాజీపడరాదని నిర్ణయించుకుంది. ఆయనకు చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్ తప్పు కాదని టీడీపీ చెప్పగలదా అని ఆయన ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి మళ్లీ ఎదురుదాడికి దిగుతున్నారని.. తప్పు చేసింది ఎవరైనా వదిలేది లేదని సజ్జల స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే చర్యలు తీసుకోవద్దా? ఓ మాఫియాలా ఏర్పడి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. వంద శాతం ఉత్తీర్ణత కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
రాజకీయ కక్ష అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. నారాయణ ఆ సంస్థలకు సంబంధం లేదంటారా.?. ఇప్పుడు అల్లుడు, కూతురు డైరెక్టర్లు అంటున్నారు. అయితే వాళ్లని అరెస్ట్ చేయొచ్చా.? నారాయణ గైడ్ చేసి నేరం చేయించాడని గిరిధర్ చెప్తున్నాడు. మరి అతను నేరం చేయలేదా?.ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే నేరుగా చంద్రబాబునే అరెస్ట్ చేస్తాం కానీ..నారాయణ ను ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. మాల్ ప్రాక్టీస్ లో మరికొన్ని సంస్థల ప్రమేయం కూడా ఉందని తేలిందని..వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.